Bhatti Vikramarka: కృష్ణా జలాలు మళ్ళించే కార్యక్రమం ప్రారంభం, ఆ మంత్రి వల్లే అవుతుంది - భట్టి
Telangana News: కృష్ణా, గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి అని మక్తల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Bhatti Vikramarka Comments: తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. కొండలు రాళ్లు, రోడ్లకు,భూస్వాములకు కాకుండా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే మొదట ఒక్క ఎకరం తో మొదలుపెట్టి మూడు ఎకరాల వరకు రైతులకు నగదు జమ చేశాం తాజాగా 4 ఎకరాల రైతులకు డబ్బులు వేయడం మొదలుపెట్టాం త్వరలోనే మిగిలిన రైతులందరికీ నగదు జమ చేస్తామన్నారు. అర్హత కలిగిన నిరుపేదలు 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు.
రాష్ట్రంలోని లబ్ధిదారుల పేర్లు పొరపాటున జాబితాలో రాకపోయినప్పటికీ కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని.. వారిని ఒత్తిడికి గురి చేయొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు భట్టి విక్రమార్క భరోసా కల్పించారు. లిస్టులో రాణి అర్హులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి మీ కరెంట్ బిల్లు , తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందించి జీరో బిల్లు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని.. చేసేదే చెబుతుంది అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రారంభించామని అన్నారు.
రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాం. ముందే చెప్పాం మొదలు పెట్టామన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముందుచూపుతోనే ఈ రాష్ట్రంలో జలయజ్ఞం కార్యక్రమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అందులో భాగంగానే 70 వేల ఎకరాలకు నీరు అందించే సంఘం మండ బాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం జరిగిందన్నారు. బండ పగలగొడితే 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కోరారు. బండ పగిలి గలగల నీరు పారుతుంటే అంతకంటే ఆనందం ఏముంటుందని డిప్యూటీ సీఎం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కటి పూర్తి కాలేదని అన్నారు.
పైన రిజర్వాయర్ కింద కాలువలు పూర్తయిన ఒక బండ పగలగొట్ట లేకపోయినా చరిత్ర గత ప్రభుత్వాన్ని అన్నారు. వారి నిర్లక్ష్యం మూలంగా నీళ్లు లేక పదేళ్లపాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. కృష్ణ గోదావరి దక్కన్ పీఠభూమి అర్థం చేసుకున్న నాయకుడు జల వనరుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సుదీర్ఘకాలం పీసీసీ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాలను మళ్ళించే శక్తి సామర్థ్యాలను ఆలోచన కలిగిన నాయకుడన్నారు. పాలమూరు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ ప్రాంతం పై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
పాలమూరు సమస్యలు తెలిసే జూరాల నుంచి కొడంగల్ నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణ నీళ్లు మళ్లించే కార్యక్రమాన్ని ప్రారంభించారని డిప్యూటీ సీఎం తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా అఖిలభారత కాంగ్రెస్ కమిటీ డాక్టర్ వంశీచందర్ రెడ్డిని ప్రకటించింది. వంశీని గెలిపించండి మీకు ఇచ్చిన హామీలన్నిటిని పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఇందిరమ్మ రాజ్యం మక్తల్కు అండగా ఉంటుందన్నారు. వంశీచందర్ రెడ్డి విద్యార్థి యువజన నాయకుడిగా ఎదిగారని తెలిపారు.