(Source: ECI/ABP News/ABP Majha)
Bhadradri Kothagudem: ఓపెనింగ్ ఊరుకోనివ్వదు.. క్లోజింగ్ నిద్రపోనివ్వదు.. దీనికి అలవాటు పడితే జీవితాలే నాశనం!
మట్కా జూదానికి సంబందించి రెండుసార్లు రిజల్ట్స్ వస్తుంటాయి. ఉదయం 10 లోపు వచ్చే రిజల్ట్స్, రాత్రి 12 గంటలకు వచ్చే ఫలితాల కోసం బెట్టింగ్ రాయుళ్లు ఎదురు చూస్తుంటారు.
ఓపెనింగ్ వదలదు.. క్లోజింగ్ నిద్దరపోనియ్యదు.. ఇది మట్కా మత్తులో తూగే యువత పరిస్థితి.. జీవితాలను చిన్నాభిన్నం చేసే మట్కా జూదానికి ఒకసారి బానిసగా మారితే అది మాత్రం పూర్తిగా నాశనం చేసేదాక విడవదు. అదే మట్కా మత్తు. కొత్తగూడెం పట్టణంలో అనేక ఏళ్లుగా కొనసాగుతున్న మట్కా మత్తులో అనేక మంది యువకులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్క రూపాయి పెట్టుబడితో 80 రూపాయలు వస్తాయనే ఆశ వారిని మట్కాకు వ్యసనపరులుగా చేసి ఆర్థికంగా దిగజార్చుతుంది. గతంలో అనేక మార్లు పోలీసులు మట్కా జూదంపై దాడులు నిర్వహించి మట్కా నిర్వహకులపై కేసులు నమోదు చేసినప్పటికీ ఈ జూదం మాత్రం యదేచ్ఛగా సాగుతూనే ఉంది.
మట్కా మత్తులో పడితే జీవితం గల్లంతే..
మట్కా అనేది ఒక జూదం.. ఇది ముంబయి కేంద్రంగా నడుస్తుంది. అనేక కంపెనీల పేర్లతో ఈ మట్కా జూదాన్ని నిర్వహిస్తుంటారు. లాటరీ వాళ్లే నిర్వహించే ఈ మట్కా జూదం ఉచ్చులో ఒకసారి పడితే దానిని వదిలించుకోవడం చాలా కష్టం. కేవలం రూ.1 కడితే రూ.80 వస్తుందనే ఆశతో ఈ మట్కా జూదానికి ఎక్కువ మంది వ్యసనపరులుగా మారుతుంటారు. 1 నుంచి 9 అంకెల వరకు బెట్టింగ్ పెడితే ఆ నెంబర్ తగిలితే వెంటనే గెలిచిన సొమ్మును మట్కా నిర్వహకులు బెట్టింగ్ రాయుళ్లకు అందిస్తుంటారు. ఉదయం తొమ్మిది గంటలకు, రాత్రి 12 గంటలకు ఒకసారి వీటికి సంబందించిన ఫలితాలు వస్తుంటాయి. స్థానికంగా ఉండే ఏజెంట్లు ముందుగా బెట్టింగ్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ రిజల్ట్స్ వచ్చాక ఎవరికైతే నెంబర్ వస్తే వారికి డబ్బులు చెల్లిస్తుంటారు. ఇదంతా ముంబయి కేంద్రంగా నడుస్తోంది.
ఓపెనింగ్ ఊరుకోనివ్వదు.. క్లోజింగ్ నిద్రపోనివ్వదు..
మట్కా జూదానికి సంబందించి రెండుసార్లు రిజల్ట్స్ వస్తుంటాయి. ఉదయం 10 లోపు వచ్చే రిజల్ట్స్, రాత్రి 12 గంటలకు వచ్చే రిజల్ట్స్ ఉంటాయి. దీంతో మట్కా వ్యసనానికి బానిసలైన వారు నిద్ర లేకుండా అదే ధ్యాసలో ఉంటుంటారు. దీంతోపాటు మట్కా ఆడటం కోసం మద్యానికి బానిసలుగా మారడం జరిగిపోతుంటుంది. ఇలా ఒకసారి మట్కా జూదానికి అలవాటుపడిన వారు పోయిన డబ్బులు తిరిగి వస్తాయనే ఆశతో మళ్లీ మళ్లీ డబ్బులు చెల్లిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. అత్యధిక కమీషన్లు వస్తుండటంతో ఏజెంట్లు సైతం జూదరుల సంఖ్య పెరిగేలా చూసుకుంటుంటారు.
నిఘా వైపల్యంతో జోరుగా మట్కా దందా..
గతంలో మట్కా జూదానికి అనేక మంది బలికావడంతో స్పందించిన పోలీసులు మట్కా ఏజెంట్లపై కేసులు నమోదు చేసి ఈ జూదంపై ఉక్కుపాదం మోపారు. అలా కొద్ది ఏళ్ల పాటు కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో సద్దుమణిగిన మట్కా జూదం ఇటీవల కాలంలో మళ్లీ జూలు విదుల్చుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని చాతకొండ కేంద్రంగా కొంత మంది ఏజెంట్లు ఈ మట్కా వ్యాపారాన్ని యదేచ్ఛగా నిర్వహిస్తున్నారని సమాచారం. యువకులు, పెద్దలు ఈ జూదానికి బానిసలుగా మారుతున్నారు. మరోవైపు పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారా మట్కా జూదం ఆడుతున్నారు. ఏది ఏమైనా జీవితాలను నాశనం చేసే మట్కా మహమ్మారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
Also Read: సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. ముంచెత్తిన సునామీ.. శాటిలైట్ వీడియో వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి