TS BJP : బండి సంజయ్ పాదయాత్ర వాయిదా తప్పదు..! తెర వెనుక ఆ సీనియర్ నేతే చక్రం తిప్పారా..?
ఆగస్టు 9వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించాలనుకున్న టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకమాండ్ నుంచి ఇంకా అనుమతి రాలేదు.
తెలంగాణ బీజేపీలో గ్రూపులన్నాయంటే ఒక్కరంటే ఒక్కరు ఒప్పుకోరు. తామంతా బీజేపీ గ్రూపు.. మోడీ గ్రూపు అంటూ ఉంటారు. కానీ... ఒకరు ముందుకెళ్తూంటే.. మరొకరు వెనక్కి లాగడానికి తాము చేయాల్సిందంతా చేస్తూంటారు. నిన్నామొన్నటిదాకా కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీలో ఆ పరస్థితి కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేయాలనుకున్న పాదయాత్రకు హైకమాండ్ నుంచి ఇంత వరకూ పర్మిషన్ రాలేదు. పైగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపారు.
మామూలుగాఅయితే ఆగస్ట్ 9నుంచి అక్టోబర్ 2వరకు తొలివిడత పాదయాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. తొమ్మిదో తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర మొదలు పెట్టాలని... తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేయాలని అనుకున్నారు. ఈ మేరకు దాదాపుగా ఇరవై కమిటీల్ని పార్టీ పరంగా నియమించారు. కానీ ఆ కమిటీల్లోని వారు ఎవరూ పని ప్రారంభించలేదు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్ దూకుడుగా వెళ్తూండటం పార్టీలోని ఇతర సీనియర్లకు నచ్చడం లేదని .. బీజేపీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది.
బండి సంజయ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ గతంలోనే కొంత మంది కామెంట్లు చేశారు. దీంతో ఇప్పటి వరకూ బీజేపీలో ఓ వెలుగు వెలిగి.. ఇంకా వెలిగిపోతున్న నేతలు రాజకీయం ప్రారంభించారని చెబుతున్నారు. ఫలితంగా బండి సంజయ్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వడం లేదు. బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. అంటే బండి సంజయ్ కూడా హాజరు కావాలి. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇంత వరకూ ఆ అనుమతి మాటే రాలేదు.
తన వివాదాస్పద వ్యాఖ్యలతో బండి సంజయ్.. పార్టీకి కొంత క్రేజ్ తీసుకు వచ్చారు. ఆయన నాయకత్వంలో .. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో మంచి విజయాలు లభించాయి. దీంతో అనేక మంది బండి సంజయ్ నాయకత్వాన్ని బలపరిచారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. బండి సంజయ్ మరీ అంత దూకుడుగా లేరు. హైకమాండ్ నుంచి ఆశించినంతగా తనకు మద్దతు దక్కకపోతూండటంతో.. ఆయన వీలైనంత కామ్‌గా పని చేసుకుపోతన్నారు. హైకమాండ్ చెప్పినవే చేస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నా కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాటలకే .. పార్టీ హైకమాండ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో బండి సంజయ్ మాట ఎక్కడా నెగ్గడం లేదు. అందుకే పాదయాత్రకు కూడా ఆయనకు అనుమతి రావడం డౌటేనని అంటున్నారు.