Bandi Sanjay Resigns: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా
ప్రస్తుతం బండి సంజయ్ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఉన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని కొద్ది రోజుల క్రితమే ఖరారైన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే తాజాగా బండి సంజయ్ పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బండి సంజయ్ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల వేళ బాపూరావును పిలిచినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. కేబినెట్ లో మార్పులు ఉంటాయనే వార్తల వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరు కేంద్ర మంత్రులను రాష్ట్రాలకు అధ్యక్షులుగా పంపుతారని సమాచారం. వీరి భేటీ తర్వాతే కొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు.
కిషన్ రెడ్డి నియామకం
బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులు అయ్యారు. ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో కీలక మార్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయించుకుందని తెలిపారు. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిపి చివరికి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
కిషన్ రెడ్డి ఇది మూడోసారి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంతకుముందు ఓసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2010 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షుడిగా పని చేశారు. మళ్లీ 2014 నుంచి 2016 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి విధులు నిర్వర్తించారు. 2016 నుంచి 2018 మధ్య శాసన సభాపక్ష నేతగా ఉండేవారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచాక ఆయన్ను కేంద్ర మంత్రి పదవి వరించింది. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఉండనున్నారు.
ఈటల రాజేందర్ కు కీలక ప్రకటన
తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.