Bandi Sanjay: ‘రే’తో మొదలు రేగ్గాయ కాదు, ఆ కాయ పేరు చెప్తారా? బండి సంజయ్ పొడుపు కథ
Elections 2024: బీజేపీ నేతలు లక్ష్యంగా కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్నారు. వారిపై వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేస్తుండడంతో ప్రత్యర్థులు కూడా దీటుగానే కౌంటర్లు వేస్తున్నారు.
Bandi Sanjay Counters Revanth Reddy: తెలంగాణ ఎన్నికల ప్రచారం వేడిగా సాగుతున్న వేళ రాజకీయ ప్రత్యర్థులు చేసుకుంటున్న విమర్శలు కొన్ని సార్లు శ్రుతి మించుతున్నాయి. బీఆర్ఎస్ - కాంగ్రెస్ - బీజేపీ నేతల మధ్య మాటకు మాటలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషిస్తుండగా.. ఆయన కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తూ బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ నేతలపైన కూడా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూడా రేవంత్ రెడ్డిపైన అదే స్థాయిలో ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీద చేస్తూ వస్తున్న వరుస విమర్శలకు ఆయన దీటైన కౌంటర్ ఇచ్చారు. ఓ పొడుపు కథతో రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.
‘‘ఉత్తి మాటల కాయ ఉత్తుత్తి కాయ.. ఒక్క చెట్టున ఉండదు ఒగలాడి కాయ.. తుట్టి నింపుకుని తుర్రుమనెడి కాయ.. చెప్పు మాటలే గాని చేయలేని కాయ.. సైజు సిన్నదే గానీ గాయి చేసేడి కాయ.. రేతోని మొదలు గాని కాదు రేగ్గాయ.. ఆ కాయ పేరు చెప్పగలరా?’’ అంటూ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతలు లక్ష్యంగా కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్నారు. వారిపై వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేస్తుండడంతో ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ఇచ్చిన హామీల్లో భాగంగా.. అప్పటి వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలను తామే ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ‘‘అప్పటి నుంచి బండి సంజయ్ పత్తా లేడు. బండి పోతే బండి ఇప్పిస్తా అన్నడు. గుండు పోతే గుండు ఇప్పిస్తా అన్నడు. బండి లేదు గుండు లేదు. ఇప్పుడు ఇంకో అరగుండు వచ్చి ఓట్లు అడుగుతున్నడు. ఆయన మనకు నయా పైసా తీసుకురాలే. బీజేపీ నేతలకు ఓట్లు వేస్తే.. గుజరాత్ కే పరిశ్రమలు తీసుకుపోతడు. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి’’ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు.
ఉత్తి మాటల కాయ ఉత్తుత్తి కాయ..
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) April 30, 2024
ఒక్క చెట్టున ఉండదు ఒగలాడి కాయ..
తుట్టి నింపుకుని తుర్రుమనెడి కాయ..
చెప్పు మాటలే గాని చేయలేని కాయ..
సైజు సిన్నదే గానీ గాయి చేసేడి కాయ..
రేతోని మొదలు గాని కాదు రేగ్గాయ..
ఆ కాయ పేరు చెప్పగలరా?