AP Telangana Water Dispute: అలా చేసి ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతులు వచ్చేవి: బండి సంజయ్
కృష్ణా-గోదావరి బోర్డులు నిర్వహించే సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బుధవారం (ఆగస్టు 11) ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
ఏపీ-తెలంగాణ జల వివాదాలపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ నిలదీశారు. కృష్ణా-గోదావరి బోర్డులు నిర్వహించే సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం హాజరు కాకపోవడంవల్ల తెలంగాణకు న్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందా? అని క్వశ్చన్ రైజ్ చేశారు. కృష్ణా-గోదావరి బోర్డుల సమావేశానికి హాజరై ఉంటే ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిలదీసి ఆపే అవకాశముండేదని.. తెలంగాణకు రావాల్సిన నీటిని పొందే హక్కు ఉండేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం (ఆగస్టు 11) ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘ఏపీ సర్కార్ అదనంగా ప్రతి ఏటా 150 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. తెలంగాణకు నష్టం జరిగేలా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బోర్డు సమావేశాలకు హాజరై ఉంటే వాటిని ప్రశ్నించి అడ్డుకునే అవకాశం ఉండేది. తెలంగాణపై అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోనే అనుమతి వచ్చే అవకాశం ఉండేది. తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉన్నా ఎందుకు హాజరు కావట్లేదు? ఈ సమావేశానికి హాజరైతే తాను చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని కేసీఆర్‌కు భయం పట్టుకుంది. జగన్‌తో కుమ్కక్కై అడ్డగోలుగా దోచుకున్న కమీషన్ల వ్యవహారం జనానికి తెలిసిపోతుందని అనుకున్నారు.’’
‘‘ఇవన్నీ తెలిస్తే ప్రజలు రాళ్లతో కొడతారనే భయంతోనే కేసీఆర్ ఈ సమావేశాలకు వెళ్లడం లేదు. అధికారులను పోనియ్యడం లేదు. పైగా మళ్లీ పిట్ట కథలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుండు. గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఈ సీఎం ప్రశ్నించలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే పట్టించుకోవట్లేదు. నేను లెటర్ రాస్తే సీఎస్‌తో ప్రకటన చేయించిండు. నేను కోరిన తర్వాతే గజేంద్ర సింగ్ షేకావత్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయినా ఆ సమావేశానికి వెళ్లకుండా సీఎం కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేశాడు.
‘‘తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసం. కానీ ఆ నీళ్ల విషయంలో ఏపీతో కుమ్కక్కై తెలంగాణాకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాడు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోపాయి కారీ ఒప్పందాలతో అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సోయి తెచ్చుకుని క్రిష్ణా-గోదావరి బోర్డుల సమావేశానికి హాజరు కావాలి. ఏపీ అక్రమాలను ఎండగట్టాలి. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించి అడ్డుకోవాలి. తెలంగాణ వాటా 550 టీఎంసీల నీటిని పొందేలా చర్యలు తీసుకోవాలి.’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.