(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay : ప్రీతి ఆత్మహత్యాయత్నానికి లవ్ జీహాదే కారణం - బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు!
ప్రీతి ఆత్మహత్యాయత్నంలో లవ్ జీహాద్ కోణం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay : మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహాత్యాయత్నం కేసులో బండి సంజయ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. 100 శాతం ఇది లవ్ జీహాదీ కేసేనన్న ఆయన... ఇది రాగింగ్ అండ్ లవ్ జీహాద్ కేసని వ్యాఖ్యానించారు. హిందు అమ్మాయిలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. నిందితుడు బయట ఉంటే కొడతారని చిన్న కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ అటెంప్ట్ వెనక సీనియర్ వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా.. దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్
ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం మానవ మృగంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. ఈ ఘటనపై ఇంకా స్పందించ లేదని, ఎస్టీలంటే కేసీఆర్ కు చిన్న చూపని ఆరోపించారు.హైదరాబాద్ నిమ్స్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మెడికో స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు హనుమకొండ జిల్లా వరంగల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు. అంతకుముందు సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు.
సైఫ్ వేధింపుల వల్లే ఆత్మాహత్యాయత్నం చేసిందన్న సీపీ
నిందితుడు సైఫే అనే మొదటి నుంచీ ప్రీతి తండ్రి నరేందర్ ఆరోపిస్తున్నారు. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని చెప్పారు. గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని వివరించారు.మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కిడ్నీ,గుండె పనితీరు మెరుగుపడినట్టుగా ప్రకటించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఎస్టీ కాబట్టే పట్టించుకోవడం లేదని ప్రీతి సోదరి దీప్తి ఆరోపణ
కేఎంసీలో పీజీ మెడికో ప్రీతి ఘటనపై ఆమె సోదరి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రీతి ఇష్యూలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని ఆమె సోదరి దీప్తి డిమాండ్ చేశారు. ప్రీతికి జరుగుతున్న ట్రీట్‌మెంట్‌పై అనుమానాలున్నాయన్నారు. ఎస్టీ అమ్మాయి కాబట్టి చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికే ప్రీతిని వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారని పేర్కొన్నారు. హెచ్ఓడీ దగ్గరి నుంచి ప్రిన్సిపల్ వరకు అందరికీ కంప్లైంట్ ఇచ్చామని.. ఏ ఒక్కరూ సరైన రీతిలో విచారణ చేపట్టట్లేదని ఆరోపించారు. ఎస్టీ కాబట్టే.. చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు.