Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టి వేత
Telangana News : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది.
Telangana Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు పోలీసులు జైల్లోనే ఉండనున్నారు. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు ఇచ్చింది. బెయిల్ ఇస్తే వారు సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. వీరి వాదనలో ఏకీభవించిన కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యారు. వీరిలో రాధాకిషన్ రెడ్డి రిటైర్ అయ్యారు. మిగతా ముగ్గురు సర్వీసులో ఉన్నారు. మరో కీలక నిందితుడు, ఈ కేసులో ఏ వన్ గా భావిస్తున్న మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు మాత్రం ఇంకా విదేశాల్లోనే ఉన్నారు. ఆయన తిరిగి రాలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావు ను .. కీలకమైన హార్డ్ డిస్క్ ల ధ్వంసం కేసులో మార్చి పదకొండో తేదీన అరెస్టు చేశారు. అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ప్రభుత్వం మారడంతో.. అన్నీ బయట పడతాయన్నభయంతో హార్డ్ డిస్కులన్నింటినీ ధ్వంసం చేశారు. వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టారు . కానీ ధ్వంసం చేసిన వాటిలో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఉండటంతో సైబర్ టెర్రరిజం కేసులు పెట్టారు. ఇప్పటికే అరెస్టైన పోలీసులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు.
అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇంత వరకూ పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభాకర్ రావు ఇంకా అందుబాటులోకి రాలేదని హైదరాబాద్ సీపీ తెలిపారు. ఆయన కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని అలాంటిదేమీ లేదన్నారు. ఆయన ఎక్కడున్నారో ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని దర్యాప్తులో బయట పడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతామన్నారు.
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు దొరికే వరకూ ఈ నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టమేనని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ టెర్రరిజం లాంటి కఠినమైన సెక్షన్లను వీరిపై నమోదు చేయాలని నిర్ణయించడంతో వారికి మరిన్ని కష్టాలు రానున్నాయి. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన కేసీఆర్ .. ఇంటర్ సెప్షన్ అనేది ఇంటలిజెన్స్ అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయాలని ముఖ్యమంత్రితో సంబంధం ఉండదని ప్రకటించారు.