కాంగ్రెస్‌తో ఎంఐఎం పొత్తు ఉందా? క్లారిటీ ఇచ్చిన ఒవైసీ
Asaduddin Owaisi: ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని వ్యాఖ్యానించారు.
AIMIM News: తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని, ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని మజ్జిస్ అధినేత ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మజ్జిస్ ఏ పార్టీకి బి టీమ్ కాదని స్పష్టం చేసిన ఒవైసీ.. రానున్న ఎన్నికల్లో మజ్జిస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ శనివారం బహుదూర్‌పురా శాసనసభ నియోజకవర్గ పరిధి ఫలక్‌నుమా ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించిన ఒవైసీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మజ్జిస్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందని, అవగాహనతో పోటీ చేస్తుందన్న ఆరోపణలను ఖండించారు.
పీడీఎం కూటమిలో మజ్లిస్ భాగం
ఉత్తరప్రదేశ్‌లోని పీడీఎం కూటమిలో మజ్లిస్ పార్టీ భాగంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తమిళనాడులోని ఏఐఏడీఎంకేతో మజ్లిస్ పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు మజ్లిస్ వైపే ఉంటారన్న ఒవైసీ.. బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దళితులు, బీసీలు, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారని, వారందరి ఓట్లతోనే తాము ఎన్నికల్లో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. సీఏఏ సమానత్వ హక్కుకు విరుద్ధమని, మతం ఆధారంగా రూపొందించారని వివరించారు. పార్లమెంట్ తాను తీవ్రంగా వ్యతిరేకించి బిల్లు ప్రతులను చించివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.