Breaking News Live Telugu Updates: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ మండలాల్లో పిడుగులు పడొచ్చు. 16 మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాం విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస మండలాలకు పిడుగు సూచన ఉంది.
అనకాపల్లి జిల్లాలో మూడు మండలాలు చీడికాడ, కె.కొత్తపాడు, దేవరపల్లిలకు పిడుగు ప్రమాదం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి మండాలకు విపత్తులనిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురంమన్యం జిల్లాలో పాచిపెంట,బలిజిపేట,పాలకొండ, సీతంపేట ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని వల్ల ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయవాడ, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా కడప జిల్లాలొకి విస్తరించనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమమయ్యాయి. పలు చోట్ల నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కాగా, రాష్ట్రంలో నేడు సైతం సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు.
శ్రీకాకుళంలో పట్టుకున్న ఎలుగుబంటి మృతి
శ్రీకాకుళంలో పట్టుకున్న ఎలుగుబంటిని విశాఖ జూకి అధికారులు తరలించాలి. మార్గ మధ్యంలో ఎలుగుబంటి మృతి చెందింది. అంతర్గత రక్తస్రావం వల్లే చనిపోయిందని జూ అధికారులు తెలిపారు. ఎలుగుబంటిని పట్టుకునే క్రమంలో స్థానికులు దానిపై దాడి చేశారు. ఈ దెబ్బల వెళ్లే చనిపోయిందని అధికారులు భావిస్తున్నారు.
యశ్వంత్ సిన్హాకు మద్దతు, సీఎం కేసీఆర్ కు శరద్ పవార్ ఫోన్
విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించాయి. విపక్షాలకు చెందిన 22 పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపాయి. సిన్హాకు మద్దతు విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ లో మాట్లాడారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. యశ్వంత్ సిన్హా కు మద్దతిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని శరద్ పవార్ తెలిపారు.
Hyderabad Gang Rape: హైదరాబాద్ పాతబస్తీలో మరో గ్యాంగ్ రేప్!
హైదరాబాద్ పాత బస్తీలో మరో దారుణం జరిగింది. చంద్రాయణ గుట్ట పరిధిలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి యువకులు సామూహికంగా అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Mahabubabad: ఆలయంలో విషాదం, కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి వర్షం కురవడంతో గుడి దగ్గర విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహించి అకస్మాత్తుగా కరెంట్ షాక్ వచ్చిందని సమాచారం. గ్రామంలోని ఆలయంలో మైక్ సెట్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను సుబ్బారావు(67), మస్తాన్‌రావు(57), వెంకయ్య (55)లుగా గుర్తించారు.