Breaking News Live Telugu Updates: ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు- చోడవరంలో మినీ మహానాడు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీలోని రాయలసీమలో పూర్తి స్థాయిలో విస్తరించిన రుతుపవనాలు తెలంగాణలోనూ వేగంగా వ్యాపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో సోమవారం ప్రవేశించిన రుతుపవనాలు రాష్ట్రం మొత్తం వ్యాపిస్తున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి., మొత్తం ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాల ఆగమనంతో మొదలైన వర్షాలతో నిన్న ఉపశమనం కలిగింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. కోస్తాంధ్ర జిల్లాల్లోకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా విస్తరిస్తోంది. మరో నాలుగు గంటల్లో విజయవాడ జిల్లాతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పల్నాడు జిల్లా నర్సారావుపేట - చిలకలూరిపేట పరిధిలో భారీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నయి. బాపట్ల జిల్లాలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు వైపు వర్షాలు కురిశాయి. విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం నగరంలో రుతుపవనాల మొదటి వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో కురుస్తున్న వర్షాలు తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరించనుంది. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి.
తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్- ఎక్కడంటే?
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు- చోడవరంలో మినీ మహానాడు
ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అన్ని వర్గాలను చిత్ర వధ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఉందన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు చంద్రబాబు. అక్రమ కేసులు పెట్టి కొందర్ని, బెదిరించి మరికొందర్ని, ఇలా రకరకాలుగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారన్ననారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నాపై మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసహనం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్. విద్యార్థులు... రాజకీయనాయకుల ట్రాప్‌లో పడొద్దని సూచన. ఆందోళనలు ఆపాలని రిక్వస్ట్ చేసిన మంత్రి. సంబంధం లేని డిమాండ్లతో విద్యార్థులు ధర్నా చేస్తున్నారని ఆసహనం
ముగిసిన విపక్షాల భేటీ
మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం ముగిసింది. మొత్తం 17 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు.
APPSC Group-1 Interviews: గ్రూప్-1 ఇంటర్వ్యూల కొనసాగించండి: ఏపీ హైకోర్టు ఆదేశాలు
Group-1 Interviews: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో గ్రూప్-1 ఇంటర్వ్యూలు కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్ 1 ఫలితాలు ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.