Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
మార్చి నెల సగంలోనే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం (మార్చి 11) పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలు వేడి నుండి కొంత ఉపశమనం పొందవచ్చని అంచనా వేసింది.
వాతావరణ శాఖ ప్రకారం, మార్చి 13 నుండి 18 వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో ఉరుములు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో ఆయా రాష్ట్రాల్లో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలో వర్ష సూచన లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ స్థితి
పశ్చిమ ప్రాంతంలోని ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. అంతేకాక, ఏపీ, యానం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో మొదటి భారీ వర్షాలు, మార్చి 16 న నుంచి మొదలైయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మార్చి 16 న మొదలై మార్చి 17, 18, 19 భారీగా మారి మార్చి 21 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
‘‘మరో నాలుగు రోజుల్లో కర్ణాటక మీదుగా ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడనుంది. దీని వలన తెలంగాణ తో పాటు ఆంధ్రా వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఒక వైపున ఏమో తేమ గాలులు ఈ గాలుల సంగమం మీదుగా రాగా, మరో వైపున ఇప్పటి దాకా కొనసాగుతున్న పొడిగాలులు గాలుల సంగమంలో ఉంటుంది. ఈ రెండు కలయిక వలన వర్షాలు బాగా పిడుగులతో, బలమైన ఈదురుగాలులతో పడనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలుగా నమోదైంది.
కొండగట్టు అంజన్న ఆలయ చోరీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ చోరీ కేస్ లో పోలీసుల పురోగతి.,
చోరీ కేస్ లో దొంగల ముఠాలో గతంలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, చోరీ జరిగిన నాటి నుండి తప్పించుకు తిరుగుతున్న మరో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన డిఎస్పీ రత్నాపురం ప్రకాష్.,
ఈ సమావేశంలో మల్యాల సీఐ రమణ మూర్తి, ఎస్సై చిరంజీవి లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది.
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు నలుగుర్ని అరెస్ట్ చేశారు. కామినేని రామక్రిష్ణ (విశాఖపట్నం సీతమ్మధార), సత్తి రవి శంకర్ రాజమండ్రి బ్రాంచ్, బి శ్రీనివాసరావు విజయవాడ లబ్బిపేట బ్రాంచ్, గొరిజవోలు శివ రామక్రిష్ణ గుంటూరు బ్రాంచ్ నుంచి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్ధించను: ఎంపీ అర్వింద్
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు.
Amit Shah: అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం - హైదరాబాద్‌లోనే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని NISA లోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు గుర్తించారు. దీంతో వల్ల హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్‌ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు.