Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందేభారత్ రైళ్లు - ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
Telangana News: ఈ నెల 12న ప్రధాని మోదీ మరో 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. వీటిలో 2 తెలుగు రాష్ట్రాల్లో నడవనున్నాయి.
Two New Vande Bharat Trains in Telugu States: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందేభారత్ (Vande Bharat) రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 12న కొత్తగా 10 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనుండగా.. 2 రైళ్లు ఏపీ, తెలంగాణలో నడపనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ (Secunderabad) - విశాఖకు (Visakha) ఓ వందేభారత్ ట్రైన్ నడుస్తుండగా.. ఇది ఉదయం విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అయితే, రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఈ రూట్ లో మరో వందేభారత్ రైలును కేటాయించారు. ఈ రైలు ఉదయం సికింద్రాబాద్ లో బయలుదేరి మధ్యాహ్నానికి విశాఖ చేరుకుంటుంది. అలాగే, విశాఖ నుంచి మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి సికింద్రాబాద్ చేరకుంటుంది. అలాగే, విశాఖ - భువనేశ్వర్ కు వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. భువనేశ్వర్ నుంచి హౌరాకు ఓ రైలు తిరుగుతుండగా, మరో అదనపు రైలును విశాఖ - భువనేశ్వర్ రూట్ లో కేటాయించారు. ఇంకా ఇతర రూట్లలో మరో 8 రైళ్లను ప్రారంభం కానున్నాయి.
విశాఖ - భువనేశ్వర్ వివరాలివే
☛ విశాఖ - భువనేశ్వర్ వందేభారత్ రైలును వారానికి ఆరు రోజులు నడపనుండగా.. సోమవారం మినహాయింపు ఇచ్చారు. 443 కిలోమీటర్ల దూరాన్ని ఆరున్నర గంటల్లోనే చేరుకోవచ్చు.
☛ ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 5:15 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి విశాఖ రైల్వే స్టేషన్ కు ఉదయం 11 గంటలకు చేరుతుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి సాయంత్రం 3:45 గంటలకు బయల్దేరి.. భువనేశ్వర్ కు రాత్రి 9:30 గంటలకు చేరుకుంటుంది.
☛ భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వందేభారత్ రైలు ఖుర్దారోడ్ (ఉదయం 5:33 గంటలకు), బరంపూర్ (ఉదయం 7:05 గంటలకు), ఇచ్ఛాపురం (ఉదయం 7:18 గంటలకు), పలాస (ఉదయం 8:18 గంటలకు), శ్రీకాకుళం రోడ్ (ఉదయం 9:03 గంటలకు), విజయనగరం (ఉదయం 09:48 గంటలకు)స్టేషన్లలో ఆగుతుంది.
☛ అలాగే, విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లే వందేభారత్ రైలు విశాఖలో మధ్యాహ్నం 03:45 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు విజయనగరం చేరుతుంది. సాయంత్రం 5:28 గంటలకు శ్రీకాకుళం రోడ్, 6:30 గంటలకు పలాస, రాత్రి 7 గంటలకు ఇచ్ఛాపురం, 7:20 గంటలకు బరంపూర్, రాత్రి 8:57 గంటలకు ఖుర్దారోడ్, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని.. ప్రతీ స్టేషన్ లోనూ ఈ రైలు 2 నిమిషాలు ఆగుతుందని అధికారులు తెలిపారు.
ఈ రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు టైం సేవ్ కావడమే కాకుండా.. ఎక్కువ మంది ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ రైళ్లతో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే వందేభారత్ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే, విజయవాడ నుంచి బెంగుళూరు లేదా చెన్నైకు ఓ వందేభారత్ కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తుండగా .. ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు, సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలును శుక్రవారం సాంకేతిక కారణాలతో రద్దు చేశారు. అయితే, దీనికి ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు వందేభారత్ ఆగే స్టేషన్లలోనే ఆగుతుందని తెలిపారు.