(Source: ECI/ABP News/ABP Majha)
AP TS Water Issue: రాష్ట్రంలో నిధుల్లేక కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం.. ఏపీలో పాలనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
తెలుగు రాష్ట్రాలే జల వివాదాలు పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రమలో భాగంగా ఆయన విజయవాడలో పర్యటించారు. ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తోందని తెలిపారు.
ఏపీకి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన విజయవాడలో పర్యటించారు. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందన్న ఆయన ఆర్టికల్ 370 రద్దు చేశామని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా ఉగ్రవాదుల దుశ్చర్యలు తావివ్వలేదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దన్న ఆయన.. సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని, వీర సతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని కిషన్ రెడ్డి అన్నారు.
జల వివాదాలు పరిష్కరించుకోవాలి
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వాటా కింద నిధులు లేకనే కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని ఆరోపించారు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలన్నారు. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం అందించిందని తెలిపారు. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసిందని గుర్తుచేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అభివృద్ధి చేసిందని తెలిపారు.
Also Read: Telangana: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు.. వీళ్లకి పదోన్నతి, సుప్రీం కొలీజయం సిఫార్సు
చివరి వ్యక్తి వరకూ వ్యాక్సిన్లు
కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలని కిషన్ రెడ్డి అన్నారు. వైద్యులను కలిసి వారిలో విశ్వాసం పెంపొందించాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వైద్యులను కలిసి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఎనికేపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతిస్తున్నామని పోలీసులు చెప్పడంతో... కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...