Telangana News: "ప్రతి మహిళా సంఘానికో బస్- నెలకు 69వేలు అద్దె వచ్చేలా ప్లాన్" మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం
కోటి మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు ఇవ్వాలని నిర్ణయించింది. దీని నుంచి నెలకు 69 వేలు అద్దె వచ్చేలా ప్లాన్ చేస్తోంది.

Telangana News: తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మహిళా సంఘాలు అభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. వారికి ఇప్పటికే తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తోంది. ఇప్పుడు వారి చేతికి బస్ స్టీరింగ్ అందించబోతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం విజయవంతమైందని, రాష్ట్రంలో మిగతా మహిళా సంఘాలకు బస్‌లు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టబోతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఈ వరాన్ని అందిస్తున్నారు. వచ్చిన మొదటి రోజే రెండు పథకాలను ప్రారంభించారు. అందులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ఇప్పుడు వారిని మరింత ఆర్థిక స్థిరత్వం దిశగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అందుకే వారితో బస్‌లు కొనుగోలు చేపించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కొత్త ఆలోచన చేస్తోంది.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం పలు కార్యక్రమాలు చేపడుతోంది. స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలను అందిస్తోంది. క్రమశిక్షణకు, నమ్మకానికి ప్రతీకలుగా నిలిచిన మహిళా సంఘాలకు ఒకపక్క రుణాలను అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబన కోసం పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటు చేయిస్తోంది. మండల మహిళా సమాఖ్యల ఆదాయం పెంపు కోసం SERP ద్వారా దేశంలోనే మొదటిసారిగా 600 బస్సులు కొనుగోలు చేయాలని ఇప్పుడు ఆలోచన చేస్తోంది. వాటిని TGSRTCకి అద్దెకి ఇచ్చేలా పథకాన్ని రూపొందిస్తున్నారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని అందించనుంది.
ఈ పథకం అమలుకు TGSRTC, సెర్ప్ మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజారవాణాలో స్వయం సహాయక సంఘాలు కీలకపాత్ర పోషించేందుకు అవకాశం దక్కుతోంది. మొదటి దశలో సెర్ప్ (SERP) ఐడెంటిఫై చేసిన 17 జిల్లాలలోని 151 మండల మహిళా సమాఖ్యలను ఒక్కొక్కటి చొప్పున 151 బస్సులు కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తారు.
రెండో దశలో 449 బస్సులను కొనుగోలు చేస్తారు. ఒక్కొక్క బస్సుకు 36 లక్షల వ్యయం కాగా అందులో 6లక్షలను మండల మహిళా సమాఖ్య తన సొంత నిధులను ఖర్చు చేస్తుంది. మిగతా 30 లక్షలను కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌గా అందించారు. TGSRTC ప్రతి బస్సుకు నెలకు రూ.69,648 అద్దెని చెల్లిస్తుంది. ఇందులో రూ.19,648 ఆపరేషన్ ఎక్స్పెండీచర్‌గా ఖర్చు చేసుకొంటున్నారు. మిగతా 50 వేలను రుణ వాయిదాగా చెల్లిస్తుంది. ఇప్పటివరకు TGSRTC అయిదు వాయిదాలు విడుదల చేసింది.
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని వల్ల మహిళా సంఘాలు లాభాలు బాటపడుతున్నాయి. TGSRTC ఇప్పటివరకు 151 మహిళా సమాఖ్యలకు అయిదు కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.
మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. TGSRTCకి మహిళా సంఘాలు బస్సులను అద్దెకిచ్చే పథకంతో గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ప్రైవేటు వ్యక్తుల బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకొనేవాళ్లు. నేడు మహిళా సంఘాలు వాటిని అందజేస్తున్నాయి. ఈ పథకం మహిళా సాధికారతకు, సామాజిక భద్రతకు అండగా నిలుస్తుంది. వారికి స్థిరమైన ఆదాయం కూడా లభించనుంది.





















