Ambati Rayudu: 'మేం నిలదొక్కుకోగలం - అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలి' - బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు
Telangana News: మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు ప్రభుత్వ భూమి కేటాయించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని అంబటి రాయుడు మర్యాద పూర్వకంగా తిరస్కరించారు.
Ambati Rayudu Tweet On BRS MLA Padi Kaushik Reddy Request: క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానం ప్రోత్సహిస్తామని.. తెలంగాణ నుంచి రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి కేబినెట్ అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతే కాకుండా మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు సైతం నగరంలో భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అంబటి రాయుడు స్పందన
అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అభ్యర్థనపై హర్షం వ్యక్తం చేస్తూనే.. ప్రభుత్వానికి ఆయన చేసిన అభ్యర్థనను మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. తనకు ఎలాంటి స్థలం అవసరం లేదని అన్నారు. 'కౌశిక్ రెడ్డి గారూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. భారత క్రికెట్‌కు మహ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఏమీ ఆశించలేదు. క్రీడాకారుల్లో నైపుణ్యాలు మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మద్దతు చాలా అవసరం. క్రికెటర్లుగా మేం ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలం. ఈ విషయంలో మేము అదృష్టవంతులం. నాకు భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి మీరు చేసిన అభ్యర్థనను నేను గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నాను. నిజంగా అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నా.' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను జత చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Kaushik reddy garu I understand that it’s very important to promote sportspersons. I am very happy that Siraj has been recognised for his efforts towards Indian cricket. I haven’t ever asked or expected anything. It is very important to support all sports and sportspersons… https://t.co/BSp5FpHT2G
— ATR (@RayuduAmbati) August 4, 2024
సీఎం రేవంత్ కీలక ప్రకటన
పాలకుల ప్రమేయం లేకుండా క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశ పెడతామని సీఎం రేవంత్ ఇటీవల అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు బీసీసీఐతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపామని.. త్వరలో భూమిని కేటాయిస్తామని చెప్పారు. అంతర్జాతీయ క్రీడాకారులు నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌లకు గ్రూప్ -1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సిరాజ్‌కు చాలినంత విద్యార్హత లేకపోయినా చట్టంలో వెసులుబాటు చేసి ఉద్యోగం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో రూ.360 కోట్లు కేటాయించామని అన్నారు.
Also Read: Filmfare Awards కొల్లగొట్టిన బలగం, దసరా మూవీ టీంలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు