Adilabad News : జైలు నుంచి ఎగ్జామ్ సెంటర్ కు, గ్రూప్-1 పరీక్ష రాసిన రిమాండ్ ఖైదీ
Adilabad News : ఆదిలాబాద్ జిల్లాలో రిమాండ్ ఖైదీ గ్రూప్-1 పరీక్ష రాశాడు. అధికారుల అనుమతితో పరీక్షకు హాజరయ్యాడు.
Adilabad News : ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఖైదీ గ్రూప్ 1 పరీక్షను రాశాడు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేష్ ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. అధికారుల అనుమతితో పరీక్ష రాయడానికి అనుమతి పొంది ఆదిలాబాద్ పట్టణంలోని విద్యార్థి కళాశాలలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యాడు. నార్నూర్ ప్రాంతానికి చెందిన జాదవ్ రమేష్ ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలు అధికారులు పూర్తి బందోబస్తుతో అతనిని పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. పరీక్ష రాసిన తరువాత తిరిగి మళ్లీ అతడిని జైలుకు తరలించారు.
15 రోజుల పాపతో పరీక్ష కేంద్రానికి మహిళ
15 రోజుల పసిపాపతో గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు ఓ మహిళ పరీక్ష కేంద్రానికి వచ్చారు. వరంగల్ ఏఎస్ఎం కాలేజీలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం హుస్నాబాద్ కు చెందిన సుమలత వచ్చారు. అయితే సుమలత నెల 15 రోజుల క్రితమే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 పరీక్ష ఉండడంతో చంటిబిడ్డతో వరంగల్ ఏఎస్ఎంలో జరిగే పరీక్షకు హాజరయ్యారు. పాపను తండ్రి తరుణ్ ఉంచి మహిళ పరీక్షకు వెళ్లారు. తండ్రి వద్ద ఉన్న పాప పాలు కోసం ఏడుస్తుండడంతో తల్లడిల్లిపోయిన తల్లి తన వద్దకు పంపాలని అధికారులను రిక్వెస్ట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏం చేయలేమని చెప్పడంతో పాప తండ్రి చివరకు డబ్బా పాలు పెడుతూ పాపను ఊరుకోబెట్టారు. ఈ ఘటన అక్కడున్న వారికి కలచివేసింది.
75 శాతం హాజరు
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
బయో మెట్రిక్ సమస్యలు
ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్-1 ఎగ్జామ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింది. సెంటర్ల దగ్గర చివరి నిమిషంలో అభ్యర్థులు హడావుడి పడ్డారు. కొన్ని సెంటర్ల దగ్గర బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడంలో ఆలస్యమైంది. ట్యాబ్ లలో ఛార్జింగ్ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో ఈ ప్రాసెస్ లేట్ అయింది. చెప్పిన టైంలోపల ఎగ్జామ్ సెంటర్ గేట్ లోనికి వెళ్లిన వారిని అనుమతించారు. 10.15 నిమిషాలకు సెంటర్ లోపలికి వెళ్లాలన్న నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడ్డారు.
Also Read : Cyberabad Police : పొరపాటున వేరే సెంటర్లకు గ్రూప్ 1 అభ్యర్థులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏంచేశారంటే!