Tribal Officer Jaga Jyothi: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్ - ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
Telangana News: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ మహిళా అధికారిణికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది.
ACB Court Remanded Tribal Officer Jaga Jyothi: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మార్చి 6 వరకూ ఆమెకు రిమాండ్ విధిస్తూ.. చంచల్ గూడ మహిళా జైలుకు తరలించాలని ఆదేశాలిచ్చింది. మరోవైపు, జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని, రిమాండ్ ఆపాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కోర్టు అనుమతి తీసుకున్నామని ఏసీబీ న్యాయమూర్తి తెలపగా.. జగజ్యోతికి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఉస్మానియాలో వైద్య పరీక్షలు
ఈ నెల 19న జగజ్యోతిని ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అదే రోజు రాత్రి ఆమె తనకు అస్వస్థతగా ఉందని ఏసీబీ అధికారులకు తెలిపారు. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యంగానే ఉన్నారని నిర్ధారిస్తూ బుధవారం డిశ్చార్జి చేశారు. అనంతరం ఆమెను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
రూ.65 లక్షలు స్వాధీనం
మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఆఫీస్‌లో జగజ్యోతి ఇంఛార్జీ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఓ నిర్మాణ పనిని, గాజులరామారంలోని బాయ్స్ హాస్టల్ నిర్మాణ పనులను గంగన్న అనే లైసెన్సుడ్ కాంట్రాక్టర్ చేపట్టారు. బిల్లుల చెల్లింపు విషయమై అధికారిణి జగజ్యోతిని సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఈ నెల 19న సోమవారం ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె అధికారుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు.. రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల విలువ అంచనా వేయాల్సి ఉందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. లంచం తీసుకుంటూ ఓ అధికారి చిక్కిన కేసులో ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు పట్టుబడడం కలకలం రేపుతోంది.
కాగా, ఇటీవల అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్.. ఓ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ తో సదరు అధికారి పని పట్టారు. అలాగే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ ను సైతం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి తహసీల్దార్ సత్యనారాయణ లంచం డిమాండ్ చేయగా.. బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో డ్రైవర్ ద్వారా రూ.10 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.