Kishan Reddy: 'కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే' - తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Telangana Politics: కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
Kishan Reddy Slams Congress And Brs in Vijaya Sankalpa Yatra: ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishanreddy) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని.. ఆ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. సోనియా కుటుంబానికి సేవ తప్ప.. హామీల అమలుపై వారికి దృష్టి లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పథకాల అమలుకు ఎన్ని లక్షల కోట్లు అవసరమో.. ఎలా సమకూర్చుకుంటారో ప్రజలకు వివరించాలని అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావని.. 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు.
'ఆ రెండూ కుటుంబ పార్టీలే'
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి విమర్శించారు. 'ఈ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ కు ఎలాంటి అజెండా లేదు. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలీదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని అన్నీ ఎంపీ సీట్లు, కర్ణాటకలో 25 సీట్లూ బీజేపీ గెలవబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3 - 4 సీట్లు సాధించినా పెద్ద ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలో బీజేపీని ఎక్కువ సీట్లు గెలవకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు. మోదీ మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. దేశంలో తొమ్మిదన్నరేళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. బీజేపీ (BJP) విజయ సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.' అంటూ కిషన్ రెడ్డి తెలిపారు.
'బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు'
అటు, ఎన్డీయేలో బీఆర్ఎస్ చేరుతామంటే చేర్చుకోమని.. బీజేపీ రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ అని.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మైండ్ గేమ్స్ ఆడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్రని చెప్పారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్లు అని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మోదీ అని కొనియాడారు. తెలంగాణలో రైల్వేల కోసం ప్రధాని రూ.4,500 కోట్లు కేటాయించారని అన్నారు. రాహుల్ గాంధీకి పేదల బతుకుల గురించి తెలియదని.. ఆయన జోడో యాత్ర వల్ల ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులను, దేశంలో మోదీని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: PM Modi: మేడారం జాతర - తెలంగాణ ప్రజలకు తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు