MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ముగ్గుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో ముగ్గుర్నీ నిందితుల జాబితాలో చేర్చలేకపోయారు.
MLA Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసు లో నలుగుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోనూ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. 23న సిట్ ధాఖలు చేసిన మెమోపై కోర్టు విచారించింది. కేసులో A4 గా సంతోష్ జి, A5గా తుషార్, A6 జగ్గు స్వామి, A7 శ్రీనివాస్‌లను చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది. కాగా మెమోపై నిందితుల తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమో ద్వారా నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రోసీడింగ్ లేదంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నిందితుల తరపు లాయర్ వాదనతో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవిస్తూ.. సిట్ వేసిన మెమోను కొట్టివేసింది. దీంతో ప్రాథమికంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీరి పేర్లు లేవు. ఇప్పుటు సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేయడంతో వారిని నిందితుల జాబితాలో సిట్ చేర్చలేకపోయింది.
ఇప్పటికే సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే
మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని జగ్గూ స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. డివిజన్ బెంచ్ ఆదేశాలు చాలా క్లియర్ గా ఉన్నా సీబీఐతో విచారణ జరిపించాలని కోరడం సమంజసం కాదని సిట్ తరపున వాదించిన దుష్యంత్ దవే చెప్పారు. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదన్న వాదనను దవే తోసిపుచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, నిందితులతో సంబంధం లేదంటూనే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వాదించారు. నిందితులు మాట్లాడిన కామెంట్స్ ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ లో బయటపడుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
వారు నిందితులు కాదని వాదిస్తున్న లాయర్లు
సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. నిందితుల తరుపున మహేష్ జెఠ్మలాని వాదనలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సిట్ పై నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని మహేష్ జెఠ్మలాని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. కేసుతో సంబంధం లేని వారిని ఎఫ్ఆర్ జాబితాలో చేర్చారని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా కేరళకు చెందిన జగ్గు కొట్టిలిల్ అలియాస్ డాక్టర్ జగ్గు స్వామికి సిట్ జారీ చేసినజారీ లుకౌట్ నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్‌కు జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 13 వరకు పొడిగించింది.
ఏసీబీ కోర్టు సిట్ మెమో తిరస్కరణతో ఆ ముగ్గురికీ రిలీఫ్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసును సవాలు చేస్తూ జగ్గుస్వామి, సంతోష్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణలో సిట్ నోటీసులో స్పష్టత లేదని లాయర్లు వాదించారు. చట్ట ప్రకారం నోటీసు లేదని, ఆ నోటీసును కొట్టేయాలని కోరారు. జగ్గుస్వామి తరఫున సీనియర్ అడ్వొకేట్ వి.పట్టాభి వాదిస్తూ.. 41ఎ నోటీసు జారీ అధికార దుర్వినియోగమన్నారు. 41, 41ఎ సెక్షన్లకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. జగ్గుస్వామి నిందితుడు కాదని, అయినా 41ఎ నోటీసు ఇచ్చారన్నారు. రిమాండ్ రిపోర్టులో కూడా ఆయన పేరు లేదన్నారు. ఇది రెండు పార్టీల మధ్య కేసని, రాజకీయ లక్ష్యసాధనలో భాగంగానే సిట్ దర్యాప్తు జరుగుతోందన్నారు. పిటిషనర్‌ను ఏవిధంగా నిందితుడిగా పిలుస్తారని ప్రశ్నించారు. కేసు వాస్తవాలు చెప్పకుండా విచారణకు రావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలో వారిని నిందితులుగా పరిగణించాన్న మెమో ఏసీబీ కోర్టులోనే ఉంది. ఇప్పుడు తిరస్కరణకు గురవడంతో.. వారిని నిందితుల జాబితాలో చేర్చి విచారణకు పిలువలేని పరిస్థితి ఏర్పడింది.