SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Google Search Scam: మనకు ఏదైనా సందేహం వస్తే దాని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. అక్కడ వచ్చిన సెర్చ్ రిజల్ట్స్‌లో నచ్చిన లింక్‌పై క్లిక్ చేసి కావాల్సిన సమాచారం తెలుసుకుంటాం. కానీ అక్కడ కూడా మోసం...
Cyber Scam Alert: ఇంటర్నెట్ వినియోగదారులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పుడు మరో స్కామ్ గురించిన రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ చేసే సైబర్ దుండగులు ఇంటర్నెట్‌లో కొన్ని ప్రత్యేక పదాల కోసం సెర్చ్ చేస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ పదాన్ని సెర్చ్ చేసినప్పుడు హ్యాకర్లు క్రియేట్ చేసిన ఫేక్ లింక్ గూగుల్ సెర్చ్ పేజీలో వస్తుంది. పొరపాటున ఈ లింక్‌పై క్లిక్ చేస్తే ఇక అంతే. మీ వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో షేర్ అయిపోతుంది. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు యూజ్ చేసిన డివైస్ అది ఫోన్ అయినా, ట్యాబ్ అయినా, కంప్యూటర్ అయినా దాని పైన కూడా పూర్తి కంట్రోల్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. మీ డేటా అంతా వారి దగ్గరకు వెళ్తుంది.
హెచ్చరించిన సైబర్ సెక్యూరిటీ సంస్థ
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ హెచ్చరిక జారీ చేసింది. ‘Are Bengal Cats Legal in Australia?’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న వ్యక్తుల వ్యక్తిగత డేటాను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్నారని కంపెనీ చెబుతోంది. సెర్చ్ చేసిన తర్వాత కనిపించే మొదటి లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది. ఈ ఆరు పదాలను సెర్చ్ చేసే యూజర్లు సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. దీన్ని ‘ఎస్ఈవీ పాయిజనింగ్’ (SEO Poisoning) అని కూడా అంటారు.
Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
లింక్‌పై క్లిక్ చేస్తే అంతే...
సోఫోస్ తెలుపుతున్న దాని ప్రకారం యూజర్లు ఈ లింక్‌లు లేదా యాడ్‌వేర్‌పై క్లిక్ చేస్తే మీ డివైస్ హ్యాక్ అవుతుంది. మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అందులో వచ్చే సెర్చ్ రిజల్ట్స్ నిజమైనవే, నమ్మదగినవే అని మనం అనుకుంటాం. కాబట్టి రెండో ఆలోచన లేకుండా దానిపై క్లిక్ చేస్తాం. కానీ అక్కడ ఉన్న మోసపూరితమైన లింక్ కారణంగా మన డేటాను కోల్పోతాం. సోఫోస్ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం స్కామర్లు ప్రధానంగా గూగుల్‌లో ఆస్ట్రేలియా గురించి సెర్చ్ చేస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
పాస్‌వర్డ్ మార్చేయాలి...
వినియోగదారులు సెర్చ్ రిజల్ట్‌పై క్లిక్ చేసినప్పుడు, వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ప్రోగ్రామ్ సహాయంతో ఆన్‌లైన్‌లో షేర్ అవుతాయని సోఫోస్ తెలిపింది. ఈ సెర్చ్ చేసిన వారు వీలైనంత త్వరగా తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని కూడా సోఫోస్ సలహా ఇచ్చింది.
ప్రస్తుతం ఉన్న సైబర్ స్కామ్‌లను ఆపడానికి ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. కానీ ఒక స్కామ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలోపు సైబర్ నేరగాళ్లు మరో కొత్త స్కామ్‌తో వచ్చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రజలే అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలి.
Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!