Samsung M33 5G Launched: రూ.16 వేలలోపే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్ - ఎలా ఉందో చూడండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త గెలాక్సీ ఎం33 5జీని మనదేశంలో లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గెలాక్సీ ఎం-సిరీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు. 5ఎన్ఎం ఆక్టాకోర్ ఎక్సినోస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్‌లో అందించిన ర్యామ్ ప్లస్ అనే ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,499గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999కు, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.19,999కు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు అందుబాటులో ఉండనుందో తెలియరాలేదు.
ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.15,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ 5ఎన్ఎం ఎక్సినోస్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ అనే ఫీచర్‌ను అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?