Smart Phones: తక్కువ ధరకే కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? బెస్ట్ టైమ్ ఇదే!
కొన్ని నెలల్లో కొత్త ఫోన్లు కొనడం అంత మంచిది కాదు. మీ జేబుకు చిల్లు పడే అవకాశాలున్నాయి. కాబట్టి, మీరు ఈ కింది సూచనలు పాటిస్తే.. మంచి ఆఫర్లతో కొత్త ఫోన్లపై నగదు ఆదా చేసుకోవచ్చు.
కొత్త ఫోన్ కొనాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడటం సాధారణమే. అయితే, ఇండియాలో పండుగ సీజన్లో మాత్రమే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. బోలెడన్ని ఫోన్లను భారీ డిస్కౌంట్లతో అమ్మకానికి పెడుతుంటారు. కానీ, ప్రతిసారి మనం ఆఫర్ల కోసం ఎదురుచూడలేం. ఒక్కోసారి అన్-సీజన్ టైమ్‌లో కూడా ఫోన్ కొనాల్సి రావచ్చు. కానీ, ఆ టైమ్‌లో ధరలు ఎక్కువగా ఉంటాయనే కారణంతో ఆ సాహసం చేయలేం. అయితే, పండుగల సీజన్‌లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా కొన్ని ఫోన్లు డిస్కౌంట్ ధరలకే లభిస్తాయనే సంగతి మీకు తెలుసా? మరి, ఏ టైమ్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి? ఎప్పుడు కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలనేగా మీ సందేహం. అయితే చూసేయండి.
ఫోన్ అమ్మకానికి వచ్చిన వెంటనే వాటిని కొనుగోలు చేయవద్దు
ఏదైనా ఫోన్ కొత్త మోడల్ అమ్మకానికి వచ్చిందంటే.. వెంటనే కొనేయడానికి ప్రయత్నిస్తాం. అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే.. ఫోన్ లాంచింగ్ సమయంలో దాని ధర చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి, అమ్మకానికి ఉంచిన వెంటనే కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. ప్రీ-ఆర్డర్ వ్యవధిలో కొనుగోలు చేయడమే బెటర్. అయితే, మీరు ఫోన్ కొనుగోలు చేసే ముందు అన్ని షాపుల్లో ధరలను ఆరా తీయండి. కొంతమంది రిటైలర్లు ముందుగానే ఆ ఫోన్లను విక్రయించడం కోసం తక్కువ ధరలను ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని దుకాణాల్లో ఉచిత బహుమతులు, గిఫ్ట్ కార్డులను కూడా అందిస్తారు.
కొత్త మోడల్ విడుదలకు ఒక నెల ముందే..
ప్రస్తుతం ఉన్న ఫోన్లు అప్‌గ్రేడ్ అవుతుంటాయి. దీంతో పాత మోడళ్లను వదిలించుకోడానికి దుకాణదారులు ప్రయత్నిస్తుంటారు. ఈ సందర్భంగా భారీ ఆఫర్లను పెడతారు. ముఖ్యంగా కొత్త మోడల్ లాంచ్ అవుతుందని తెలిసిన ఒక నెల ముందు భారీ ఆఫర్లతో పాత మోడళ్లను అమ్మేస్తుంటారు. మీకు అలాంటి ఫోన్లను కొనేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటే.. ఇదే మంచి సమయం. అలాంటి విక్రయాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. మీరు వెంటనే ప్లాన్ చేసుకోకపోతే స్టాక్ త్వరగా ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంది.
బ్లాక్ ఫ్రైడే రోజు కొనుగోలు చేయొచ్చు
ఏటా నవంబర్ నాలుగో వారంలోని గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు బ్లాక్ ఫ్రైడే కింద ఫోన్లతోపాటు వివిధ వస్తువులను అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఫోన్లు కొనుగోలు చేయడానికి కూడా ఇదే బెస్ట్ టైమ్. కేవలం దుకాణాల్లోనే కాదు, ఆన్‌లైన్ కూడా బోలెడన్ని ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, కొన్ని ఆన్‌లైన్ సంస్థలు, దుకాణాలు బ్లాక్ ఫ్రైడే కంటే ముందుగానే ఆఫర్లు ప్రకటించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, మీరు ముందుగా ప్లాన్ చేసుకుని ధరలను గమనిస్తుండాలి.
వార్షికోత్సవాల్లో..
కొన్ని ఆన్‌లైన్ సంస్థలు తమ వార్షికోత్సవాలు భాగంగా కొన్ని మొబైల్ సంస్థలతో ఒప్పందం చేసుకుని భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తమ ప్లాట్‌ఫామ్ యూజర్లను పెంచుకొనేందుకు వస్తువుల అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. అలాగే గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం రోజుల్లో కూడా మంచి ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. అయితే, ఫిబ్రవరి నెలలో మాత్రం మీరు ఫోన్ కొనాలనే ఆలోచన చేయొద్దు. కేవలం స్టాక్ క్లియరెన్స్ తగ్గింపులు ఉండవచ్చు. అయితే, మార్చి, ఏప్రిల్ నెలలో అవి కూడా ఉండవు.
మే నెల నుంచి ఆఫర్లు మొదలు
ఏప్రిల్ చివరి వారం నుంచి క్రమేనా ఆఫర్లు మొదలవుతాయి. వేసవిలో విక్రయాలు జోరందుకుంటాయి. ఈ సందర్భంగా మే నెలలో పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించే అవకాశాలుంటాయి. మే నెలలో ఫోన్లు కొంటే బోలెడంత డబ్బు ఆదా అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, జూన్ లేదా జూలైలో పెద్దగా ఈవెంట్‌లు ఉండవు. దానివల్ల ఆఫర్లు కూడా ఉండవు. ఇక ఆగస్టు నుంచి అసలు సందడి మొదలవుతుంది. రక్షాబంధన్, ఫ్రెండ్‌షిప్ డే నుంచి ఇండిపెండెన్స్ వీక్ వరకు వివిధ ఆఫర్లు ముంచెత్తుతాయి. మళ్లీ సెప్టెంబర్‌లో ఆఫర్లు తగ్గుతాయి. అక్టోబర్, నవంబరు నెలల్లో మళ్లీ ఆఫర్లు జోరందుకుంటాయి. దసరా, దీపావళి సందడి నేపథ్యంలో పోటాపోటీ ఆఫర్లు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. డిసెంబరులో క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. జనవరిలో ఇండిపెండెన్స్ డే ఆఫర్లతో తక్కువ ధరలకే కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.
ఎలాపడితే అలా కొనేయొద్దు.. కంపారిజన్ తర్వాతే కొనాలి
ఉత్తమ ఆఫర్‌లను పొందాలంటే మీరు తప్పకుండా కంపారిజన్ షాప్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆన్‌లైన్ సంస్థ మీకు ఎక్కువ ఆఫర్ ఇస్తుందో చూడండి. అలాగే బయట షాపుల్లో ఫోన్ కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే.. ముందుగా ఆన్‌లైన్‌లో మీరు సెలక్ట్ చేసుకున్న ఫోన్ ధర ఎంతో చెక్ చేయండి. ఇప్పుడు తెలిసిందిగా.. ఇకపై కొత్త ఫోన్లు కొనుగోలు చేసేప్పుడు పైవన్నీ పాటించండి.
Also Read: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!