India Becomes Number 1: అమెరికా, చైనా వివాదంలో భారత్‌కు భారీ లాభం.. డ్రాగన్ కంట్రీని వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానం
Tariff war between US and China : ఆపిల్ కంపెనీ సంవత్సరానికి 22 కోట్లకు పైగా ఐఫోన్లు విక్రయిస్తోందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇటీవల చైనాను వెనక్కినెట్టి భారత్ నెంబర్ వన్ అయింది.

న్యూఢిల్లీ: భారతదేశం ఆపిల్ ఐఫోన్ల విషయంలో అద్భుత విజయం సాధించింది. ఐఫోన్ల తయారీలో డ్రాగన్ కంట్రీ చైనాను కూడా వెనక్కి నెట్టింది. మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ ఓమ్డియా తాజా రిపోర్ట్ ప్రకారం, అమెరికాకు ఐఫోన్లను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.
తాజా నివేదిక ప్రకారం, ఏప్రిల్‌లో భారతదేశంలో తయారైన దాదాపు 30 లక్షల ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో, చైనా నుండి ఐఫోన్ల ఎగుమతి 76 శాతం తగ్గింది, కేవలం 9 లక్షల యూనిట్లకు మాత్రమే పరిమితమైంది.
చైనాతో టారిఫ్ యుద్ధం.. భారతదేశానికి ప్రయోజనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో తయారు చేయని వస్తువులపై 25 శాతం టారిఫ్ విధించే హెచ్చరికలు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చాయి. అమెరికా టారిఫ్‌లతో చైనా దేశంలో ఆపిల్‌కు తీవ్రమైన సవాలు ఎదురవుతోంది. ట్రంప్ ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను భారతదేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయకూడదని ఇటీవల కోరడం తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత అమెరికాకు భారత్ ఐఫోన్ల ఎగుమతిపై ఈ నివేదిక వచ్చింది. చైనాతో అమెరికా దూరం పెంచుకుంది, దాంతో యాపిల్ భారతదేశంలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఆపిల్ కంపెనీ ఏడాదికి 22 కోట్లకు పైగా ఐఫోన్లను విక్రయిస్తుంది. యాపిల్ ఐఫోన్ల అతిపెద్ద మార్కెట్లలో అమెరికా, చైనా, యూరప్ ఉన్నాయి.
అమెరికాలో తయారైన ఐఫోన్ ధర ఎంత?
ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం, అమెరికా పూర్తిగా తయారు చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల 'మేడ్ ఇన్ యుఎస్ఏ' ఆపిల్ ఐఫోన్ ధర 3,500 డాలర్లు (2,98,000 రూపాయలకు పైగా) ఉండవచ్చు. దేశంలో ప్రస్తుతం ప్రతి త్రైమాసికంలో దాదాపు 2 కోట్ల ఐఫోన్ల విక్రయాలకు డిమాండ్ ఉంది.
భారతదేశంలో తయారైన ఐఫోన్లను తమిళనాడులోని ఫాక్స్‌కాన్ కంపెనీ కర్మాగారంలో అసెంబుల్ చేస్తుంటారు. టాటా ఎలక్ట్రానిక్స్ కూడా మరో ప్రధాన తయారీదారుగా ఉంది. టాటా కంపెనీ, ఫాక్స్‌కాన్ కలిసి ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి దేశంలో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, నిపుణుల ప్రకారం, అమెరికాలో పెరిగే ఐఫోన్ల డిమాండ్లను తీర్చడానికి భారత్‌కు మరికొంత టైం పడుతుంది. భారతదేశంలో ఉత్పత్తి పెంచడం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, మన ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.






















