Android Smartphones Cyber Attack: 100 కోట్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు హ్యాకింగ్ ముప్పు.. వెంటనే ఈ పనులు చేయండి
ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మేర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పాత వెర్షన్ సాఫ్ట్‌వేర్ మీద నడుస్తున్నాయి. దీనివల్ల 100 కోట్ల మొబైల్స్ సైబర్ అటాక్ బారిన పడే ప్రమాదం ఉంది.

Android Smartphones At Risk | ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల యాక్టివ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంది. తాజా డేటా ప్రకారం, ఈ ఫోన్‌లు పాత సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల ఆ స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేసుకోవడం తేలిక అవుతుంది. వాస్తవానికి, కొన్ని సంవత్సరాల తర్వాత గూగుల్ పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ విడుదల చేయడం ఆపివేస్తుంది.వినియోగదారులకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలని నోటిఫికేషన్ ఇస్తుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 30 శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పాత సాఫ్ట్‌వేర్‌పై నడుస్తున్నాయని, వాటికి సైబర్ ముప్పు ఉందని తెలుస్తోంది.
దాదాపు ఒక బిలియన్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రమాదం
StatCounter తాజా డేటా ప్రకారం, 30 శాతం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే పాత సాఫ్ట్‌వేర్‌ను ఇంకా ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్య దాదాపు 100 కోట్లుగా ఉంది. దీని అర్థం ఈ వినియోగదారులు సైబర్ దాడుల ప్రమాదానికి దగ్గరగా ఉన్నారు. దాంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు వారి పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత డేటాను దొంగిలించవచ్చు. పాత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం తప్పు కాదు. అయితే దానికి సెక్యూరిటీ అప్‌డేట్‌లు రావు. అందువల్ల, వినియోగదారులకు వారి సాఫ్ట్‌వేర్‌ను నిరంతరం అప్‌డేట్ చేయాలని నిపుణులు సూచిస్తారు.
సైబర్ దాడుల ప్రమాదాల నుండి ఎలా రక్షించుకోవాలి?
- నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటి నుండి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పననిసరి. మీ ఫోన్‌ను ఎల్లప్పుడూ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్‌గా ఉంచండి.
- మీ ఫోన్ చాలా పాతది, తాజా అప్‌డేట్‌లకు మద్దతు ఇవ్వకపోతే, కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనేది సంకేతం.
- కొత్త ఫోన్‌లపై కంపెనీలు దాదాపు 7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఇస్తామని మాట ఇస్తున్నాయి. ఈ సందర్భంలో కొత్త ఫోన్ మిమ్మల్ని చాలా సంవత్సరాల పాటు హ్యాకింగ్ ప్రమాదాల నుండి రక్షించగలదు.
ఫోన్‌ను అప్‌డేట్‌గా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
- మీరు క్రమం తప్పకుండా మీ స్మార్ట్ ఫోన్‌ను అప్‌డేట్ చేస్తే, సైబర్ దాడుల నుండి మీకు తెలియకుండానే కొంతమేర రక్షణ లభిస్తుంది.
- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో అనేక కొత్త ఫీచర్లు కూడా వస్తాయి. ఇది ఫోన్‌ను ఉపయోగించడం సులభతరం చేయడంతో పాటు ఫోన్లో వైరస్, బగ్ లకు చెక్ పెడుతుంది.
- ఫోన్‌ను అప్‌డేట్‌గా ఉంచడం వల్ల దాని వేగం పెరుగుతుంది. మీ బ్యాటరీ వినియోగం కొంత తగ్గుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు మీ మొబైల్ స్ట్రక్ అయ్యే పరిస్థితి తలెత్తదు.






















