No Adds on Facebook: త్వరలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు కనిపించవు, మొదట అమలు ఎక్కడంటే..
No Advertisement on Instagram | మెటా త్వరలో Instagram, Facebook లలో ప్రకటనలు లేకుండా సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తుంది. అందుకోసం కొంత మొత్తం చెల్లించాలి. మొదట యూకేలో ఇది అమలు చేస్తున్నారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే ప్రకటనలతో మీరు విసిగిపోయారా... కొన్ని పోస్ట్‌లు లేదా రీల్స్ తర్వాత ఏదో ఒక ప్రకటన తప్పక చూడాల్సి వస్తుంది. మీరు కూడా ఈ యాడ్స్ తో విసిగిపోయినట్లయితే, మీకు త్వరలో దీని నుండి ఉపశమనం కలగవచ్చు. వాస్తవానికి, యునైటెడ్ కింగ్‌డమ్‌లో వినియోగదారులు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ప్రకటనలను నిలిపివేసే సౌకర్యాన్ని పొందనున్నారు. అయితే, దీని కోసం వారు కొంత మొత్తం చెల్లించక తప్పదు. మెటా సంస్థకు చెందిన ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లను సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా, వినియోగదారులు ప్రకటనలు లేకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను స్క్రోల్ చేయగలరు.
త్వరలో ప్రారంభం
మీడియా నివేదికల ప్రకారం, కొన్ని వారాల్లో UKలో 18 ఏళ్లు పైబడిన వినియోగదారులు ప్రకటనలు లేకుండా మెటాకు చెందిన ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించే అవకాశం ఉంది. ప్రకటనలతో కూడిన ఉచిత వెర్షన్‌ను ఉపయోగించే అవకాశం కూడా వారికి ఉంటుంది. వారు నెలవారీ కొంత మొత్తం చెల్లించడం ద్వారా ప్రకటనలు లేని వెర్షన్‌ను కూడా యాక్సెస్ చేస్తారు. ఏ వినియోగదారుడైనా రుసుము చెల్లించకూడదనుకుంటే, అతను ఏం చేయకుండా ఇప్పటికే ఉన్న వెర్షన్‌ను ఉపయోగించాలని సంస్థ సూచించింది.
ఎంత డబ్బు చెల్లించాలి
ప్రకటనలు లేని వెర్షన్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ప్రతి నెలా కొంత నగదు చెల్లించాలి. మొబైల్‌లో దీని రుసుము దాదాపు రూ. 475 కాగా, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ లలో నెలకు రూ. 355 మేరకు చెల్లించాలి. ఒక యూజర్ ఒక పరికరంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగిస్తే, అతను అందుకు విడిగా నగదు చెల్లించాలి. మొబైల్‌లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగించడానికి, ప్రతి నెలా దాదాపు రూ. 357 అదనంగా, వెబ్‌సైట్ కోసం అయితే రూ. 238 అదనంగా చెల్లించాలి. ఈ మోడల్ వినియోగదారులకు యాడ్స్ ఇబ్బంది తొలగించనుందని మెటా పేర్కొంది. వినియోగదారుడు ఎలాంటి డబ్బు చెల్లించకుండా ప్రకటనలను చూస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యథాతథంగా ఉపయోగించవచ్చు, అయితే ఎవరైనా ప్రకటనలు వద్దు అనుకుంటే వారు దాని కోసం పైన పేర్కొన్న మొత్తం చెల్లించాలి. ప్రకటనల కారణంగా UKలో చిన్న వ్యాపారాలకు బూస్టింగ్ అందుతోందని, దీని కారణంగా 2024లో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని మెటా కంపెనీ తెలిపింది.






















