IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?
వచ్చే సంవత్సరం జరిగనున్న ఐపీఎల్‌లో 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు టోర్నీ ఫార్మాట్ కూడా మారనుంది. కొత్త ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉండనున్నాయంటే?
ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 జట్లు తలపడనున్నాయి. నేడు ముగిసిన బిడ్డింగ్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లను సీపీసీ, ఆర్పీఎస్‌జీ కంపెనీలు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. జట్ల సంఖ్య 10కి పెరిగింది కాబట్టి టోర్నీ ఫార్మాట్ కూడా కాస్త మారనుంది.
ఐపీఎల్ 2022 ఫార్మాట్ ఎలా ఉండనుంది?
వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఉండనున్నాయి. ప్రతి జట్టూ ఏడు మ్యాచ్‌లను సొంత మైదానంలో, ఏడు మ్యాచ్‌లను ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. 2011 ఐపీఎల్ తరహాలో ఈ సీజన్ జరగనుందని తెలుస్తోంది. అప్పుడు మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ప్రతీ జట్టూ.. తమ గ్రూపులో జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. మరో గ్రూపులోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని, మిగిలిన జట్టుతో రెండు మ్యాచ్‌లను ఆడతాయి. అంటే ప్రతి జట్టూ ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయన్న మాట.
లీగ్ దశ ముగిసిన అనంతరం.. అన్ని జట్లను వాటి పాయింట్లు, నెట్ రన్‌రేట్ ప్రకారం ర్యాంక్ చేస్తారు. ఈ జాబితాలో టాప్-4 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి. ఈ ప్లేఆఫ్స్‌లో మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్‌లోనే క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి.
పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లూ క్వాలిఫయర్ 1 ఆడతాయి. ఇక్కడ గెలిచిన టీం నేరుగా ఫైనల్స్‌కు వెళ్లిపోతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లిపోతుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు, క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్ ఆడతాయి. ఫైనల్‌లో గెలిచిన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుంది.
వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లు కొత్తగా పోటీ పడనున్నాయి. బిడ్డింగ్‌లో సీవీసీ క్యాపిటల్, ఆర్పీఎస్‌జీ కంపెనీలు ఈ జట్లను దక్కించుకున్నాయి. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు దక్కించుకోగా, సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5,166 కోట్లకు చేజిక్కించుకుంది. మొత్తం 22 కంపెనీలు రూ.10 లక్షల విలువైన టెండర్ డాక్యుమెంట్‌ను దక్కించుకున్నాయి.
ఐపీఎల్ కొత్త జట్ల బిడ్డింగ్‌లో బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోనే, రణ్‌వీర్ సింగ్ కూడా కన్సార్షియం ద్వారా పాల్గొంటారని వార్తలు వచ్చాయి. కానీ బిడ్డింగ్‌లో మాత్రం వారి పేర్లు వినిపించలేదు.
Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?