ICC T20 WC 2021, IND vs PAK: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
పాక్ చేతిలో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. టాస్ నుంచి మొదలుకొని బౌలింగ్ వరకు అన్నీ పాక్‌కు కలిసొస్తే భారత్‌కు వ్యతిరేకంగా మారాయి.
టీ20 క్రికెట్ అంటేనే అలా ఉంటుంది మరి! దానికి అస్సలు దయ ఉండదు. గెలిచే జట్టును ఓడిస్తుంది. ఓటమి పాలయ్యే జట్టును విజేతగా నిలబెడుతుంది. టీమ్‌లో ఒకరో ఇద్దరో నిలిస్తే విజయం వరించేస్తుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ గెలుపును ఇదే సూచిస్తోంది! దశబ్దానికి ఒక్క పోరుగా భావించే ఈ మ్యాచులో కోహ్లీసేన ఓటమికి.. బాబర్ బృందం గెలుపునకు ఐదు కారణాలు ఉన్నాయి!
టాస్ ఓటమి
ఆట కదా ముఖ్యం! టాస్‌ది ఏముంది అంటారా? కానీ గెలుపోటముల్లో టాస్‌దే కీలక పాత్రే. దుబాయ్‌లో విరాట్ కోహ్లీ టాస్ గెలిస్తే ఆట మరోలా ఉండేది. ఏమాత్రం ఆలోచించకుండా ఛేదనకు మొగ్గు చూపేవారు. ఎందుకంటే అక్కడ ఛేదనే సులభం. పైగా టీమ్‌ఇండియాకు మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారీ లక్ష్యాలు నిర్దేశించే అలవాటు లేదు. ఆ బలహీనత పాక్‌కు వరంగా మారింది. పైగా విరాట్ కోహ్లీకి టాస్ గెలిచే అలవాటూ లేదు! అతడి టాస్ విజయాల శాతం కేవలం 39. ఇది పాక్‌కు మేలు చేసింది.
ముంచిన 'మంచు'
ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ఓటమికి మరో ప్రధాన కారణం 'మంచు'. సాధారణంగా ఛేదనల్లో డ్యూ ఫ్యాక్టర్ అత్యంత కీలకం అవుతుంది. కోహ్లీసేన బ్యాటింగ్ చేసేటప్పుడు వాతావరణం భిన్నంగా ఉంది. మంచు తక్కువగా కురిసింది. దాంతో పాక్ బౌలర్లు బంతితో చెలరేగారు. వేగం తగ్గించి బంతులేసి ఇబ్బంది పెట్టారు. కానీ ఛేదనలో టీమ్‌ఇండియా అలా లేదు. మైదానంలో పచ్చికపై పచ్చిదనం పెరిగింది. బంతి తడిగా మారింది. బౌలర్ల చేతులూ తడి అయ్యాయి. దాంతో బంతిపై పట్టు చిక్కలేదు. స్పిన్నర్లు డ్రిఫ్ట్ చేయలేకపోయారు. పేసర్లు సరైన ప్రాంతాల్లో బంతులు విసరలేకపోయారు.
చూడ్డానికే సొట్టబుగ్గలు..!
పాక్ విజయం, టీమ్‌ఇండియా ఓటమికి ప్రధాన కారణం సొట్టబుగ్గల పేసర్ షాహిన్ షా అఫ్రిది. వాస్తవంగా టీ20 క్రికెట్లో అతనో అద్భుతం. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో ప్రపంచంలోనే అతడు టాప్. అనూహ్యమైన వేగంతో ఇన్‌కమింగ్ డెలివరీలు వేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. నాలుగో బంతికే రోహిత్‌ను ఎల్బీ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే విపరీతమైన వేగంతో రాహుల్ వికెట్లు ఎగరగొట్టాడు. అడ్డంగా ఆడాలనుకున్న రాహుల్ బ్యాటు, ప్యాడ్ల మధ్య నడుము ఎత్తులో వచ్చిన ఆ ఇన్‌కమింగ్ డెలివరీ (బహుశా నోబాల్) బెయిల్స్‌ను ముద్దాడింది. ఇక అర్ధశతకం చేసిన విరాట్‌కోహ్లీని మరింత విధ్వంసం చేయకుండా డెత్ ఓవర్లలో ఔట్ చేశాడు. మరో 20-30 పరుగులు చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది.
వారి బ్యాటింగ్ సూపర్.. మన బౌలింగ్ వీక్
మన బౌలింగ్‌ను మరీ పేలవంగా ఉందని చెప్పడం కన్నా పాక్ బ్యాటింగ్ అద్భుతమని చెప్పడం సబబు! ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (79), బాబర్ ఆజామ్ (68) పాజిటివ్ ఇంటెంట్‌తో మైదానంలో అడుగుపెట్టారు. భారత్‌పై ఏ వికెటైనా అత్యధిక భాగస్వామ్యమైన 152 చేసేశారు. వారికి పవర్‌ప్లేలో సరైన స్కోరు రావడం కలిసిసొచ్చింది. ఎనిమిదో ఓవర్ నుంచి డ్యూ మరింత పెరిగింది. బంతి చక్కగా బ్యాటు మీదకు రావడంతో ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టేశారు. క్రీజులో పాతుకుపోగల బాబర్ ఆజామ్ వారి బలం. అయితే ఒక్క వికెట్టైనా తీయకపోవడం టీమ్‌ఇండియా పరంగా దారుణం.
హెడేన్, ఫిలాండర్ ప్లానింగ్
ఈ పోరులో పాక్ మంచి వ్యూహాలతో వచ్చింది. వాటిని పక్కగా అమలు చేసింది. నిజానికి వారు ఒకరోజు ముందే జట్టును ప్రకటించి సవాల్ చేశారు. భారత్ సరైన వ్యూహాలే రచించినా అమల్లో విఫలమైంది. పాక్ మాత్రం పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఆడింది. ఈ సారి ఎలాగైనా గెలవాలి.. చరిత్ర తిరగరాయాలన్న కసితో కనిపించింది. టైట్ లెంగ్తుల్లో బౌలర్లు బంతులేస్తే ఇద్దరు బ్యాటర్లే పరుగులు చేశారు. ఫీల్డర్లు ఒక్క క్యాచైనా వదల్లేదు. బౌండరీలూ ఆపారు. మైదానంలో చురుగ్గా కదిలారు. మాథ్యూ హెడేన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ అవ్వడం పాక్ బ్యాటింగ్‌లో దూకుడు పెంచింది. రమీజ్ రాజా పీసీబీ చీఫ్ అవ్వడం వారిని మానసికంగా దృఢంగా మార్చింది. దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం ఫిలాండర్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవడం కలిసొచ్చింది.
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!
Also Read: SL vs BANG, Match Highlights: బంగ్లా పులులను అల్లాడించిన అసలంక..! 172ను ఊదేసిన సింహళీయులు!