ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
ఒత్తిడి చంపేస్తున్నప్పుడు.. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు.. అదీ వందకోట్ల మంది భావోద్వేగం ముడిపడినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కష్టం. అందుకు ఆ నలుగురు కెప్టెన్ల చర్చే నిదర్శనం.
![ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో? ICC T20 WC 2021: IND vs PAK melodrama in Indian team before 18 over aganist Pakistan match 16 at Dubai International Stadium know in detail ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/25/5a7d965d94408457ceebb6ed75b719bb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొన్నిసార్లంతే..! ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో జరుగుతుంది! ఎంత మంది వ్యూహకర్తలు ఉన్నా అమల్లో మాత్రం సున్నా అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్-12లో పాక్‌తో మ్యాచులో ఇలాగే జరిగింది. ఎందుకంటే ఏకంగా నలుగురు కెప్టెన్లు మైదానంలో ఉన్నారు. మరో కెప్టెన్, బిగ్‌బాస్ డగౌట్‌లో ఉన్నాడు. అయినా సరే లెక్క తప్పి ముందే ఓటమి ఖరారు చేసేశారు!
ఏంటా కథ?
పాక్ ఛేదనలో 18వ ఓవర్‌కు ముందు ఓ మెలోడ్రామా కనిపించింది! ఏకంగా నలుగురు కెప్టెన్లు బౌలింగ్ ఎవరికిస్తే బాగుంటుందో చర్చించారు. 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో తెలియదు గానీ షమికి బౌలింగ్ ఇవ్వాలన్న నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది.
ఇదీ నేపథ్యం!
152 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పాక్ 135/0తో ఉంది. చేయాల్సిన పరుగులు కొన్నే అయినా టీమ్‌ఇండియాలో, అభిమానుల్లో ఏ మూలో చిన్న ఆశ! అద్భుతం ఏమైనా జరుగుతుందా అని! అప్పటికి బాబర్ ఆజామ్ (66), మహ్మద్ రిజ్వాన్ (64) ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. సమీకరణం బంతికో పరుగు చేస్తే చాలన్నట్టుగా మారిపోయింది. పాక్ 18 బంతుల్లో 17 పరుగులు చేస్తే చాలు. టీమ్‌ఇండియా గెలవాలంటే రెండు ఓవర్ల పాటు 4-5 పరుగులకు మించి ఇవ్వొద్దు.
కథలో పాత్రలు!
ఇలాంటి కీలక తరుణంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది? జట్టులోని అత్యుత్తమ బౌలర్‌కు బంతినివ్వాలనే అనిపించాలి. విరాట్ కోహ్లీ ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాడోనని అందరికీ ఓ డౌట్ ఉంటూనే ఉంటుంది. ఏదేమైనా సరే అతడి వద్దకు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వచ్చారు. వారికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి ఉన్నారు.
డిస్కషన్స్ ఆన్!
ఈ సన్నివేశం చూస్తే భలే అనిపించింది! వారిలో రోహిత్ శర్మకు ఐదుసార్లు ఐపీఎల్ గెలిచిన అనుభవం ఉంది. బౌలర్లను ఎప్పుడెలా ఉపయోగించాలో బాగా తెలుసు. ఇక యువ రిషభ్ పంత్ దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్. లీగులో ఆఖరి వరకు జట్టును అద్భుతంగా నడిపించి చివర్లో ఒత్తిడికి లోనైన నాయకుడు. కానీ పాఠాలు మాత్రం బాగానే నేర్చుకున్న అనుభవం ఉంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కూ బౌలర్లను ఉపయోగించడంలో తెలివితేటలు ఉన్నాయి. కోహ్లీ అటు బెంగళూరు, ఇటు టీమ్‌ఇండియాకూ సారథి. భువీకీ సన్‌రైజర్స్‌ను నడిపించిన తెగువ ఉంది. మంచి ఆలోచనా పరుడే. బుమ్రా కెప్టెన్సీ చేయలేదు గానీ మ్యాచ్‌ను అద్భుతంగా అధ్యయనం చేయగలడు. పరిస్థితికి తగ్గట్టు బ్యాటర్‌ను బోల్తా కొట్టించి మైండ్ గేమ్‌లో ముందుండ గలడు. ఇక డగౌట్‌లో బిగ్‌బాస్ ధోనీ ఉన్నాడు. ఇషాన్‌తో సలహాలు చేరవేస్తూనే ఉన్నాడు.
యాంటీ క్లైమాక్స్
చర్చలకు ముందు బంతి బుమ్రా చేతిలో ఉంది. చర్చల సారాంశం ఏంటో తెలియదు గానీ రోహిత్ కాస్త అసంతృప్తిగానే వెళ్లినట్టు అనిపించింది. రాహుల్, పంత్ ఎవరి స్థానాలకు వారు వెళ్లారు. బుమ్రా చేతిలో ఉన్న బంతి షమి చేతికి వచ్చింది. కథ అడ్డం తిరిగింది కాబట్టి ఈ నిర్ణయం తప్పే అనిపించొచ్చు! కానీ ఆ వ్యూహం వెనకున్న నేపథ్యం అర్థం చేసుకోతగిందే. షమి గనక 18వ ఓవర్లో పరుగులను నియంత్రిస్తే కీలకమైన 19 ఓవర్లో బుమ్రా యార్కర్లతో పాక్‌ను బెంబేలెత్తించగలడు. అంటే ఆఖరి ఓవర్‌కు కాస్త ఎక్కువ స్కోరుంటే పాక్ ఓపెనర్లు ఒత్తిడికి లోనవుతారని ఉద్దేశం.
ఆఖరికి అ'శుభం'!
టైట్ లెంగ్త్ వేయాల్సిన పరిస్థితుల్లో మొదటి బంతినే షమి ఫుల్‌టాస్ వేశాడు. రిజ్వాన్ నేరుగా లెగ్‌సైడ్ సిక్సర్ కొట్టేశాడు. అయితే మంచు కురుస్తున్నప్పుడు, చేతులు జారుతున్నప్పుడు సరైన లెంగ్తుల్లో బంతులు పడవన్న విషయం మనం అర్థం చేసుకోవాలి! ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్‌లో ఫుల్లిష్ డెలివరీగా వేసిన రెండో బంతిని రిజ్వాన్ బౌండరీ బాదేయడంతో భారతీయుల గుండెల్లో బాంబు పేలింది. ఇక ఆఫ్‌సైడ్ షార్ట్‌లెంగ్త్ బంతి రిజ్వాన్ చెస్ట్ వరకు వచ్చింది. దురదృష్టవశాత్తు అది బ్యాటు అంచుకు తగిలి బౌండరీ వచ్చేసింది. దాంతో పాక్‌లో టీవీల బదులు టపాసులు పేలాయి. ఇక్కడేమో అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి!
నోట్: ఒత్తిడి చంపేస్తున్నప్పుడు.. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు.. అదీ వందకోట్ల మంది భావోద్వేగం ముడిపడినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కష్టం. కొన్నిసార్లు అవి సఫలం అవుతాయి. మరికొన్ని సార్లు విఫలమవుతాయి. ఏదేమైనా ఆటలో గెలుపోటములు సహజం. అంతిమంగా క్రికెట్టే విజేత!?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!
Also Read: SL vs BANG, Match Highlights: బంగ్లా పులులను అల్లాడించిన అసలంక..! 172ను ఊదేసిన సింహళీయులు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)