Fake Android App: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? - అయితే బీ కేర్‌ఫుల్! - మీ వాట్సాప్ డేటా బయటకు పోతున్నట్లే!
మీ ఫోన్‌లో ‘సేఫ్‌ఛాట్’ అనే యాప్ ఉందా? అయితే మీ డేటా చోరీకి గురవుతున్నట్లే!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు వినియోగించే యాప్స్‌లో వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. మనదేశంలో కూడా ఈ యాప్‌కు కోట్లలో యూజర్లు ఉన్నారు. దీంతో సైబర్ క్రైమ్ చేసేవారు ఎవరికి అయినా వాట్సాప్ యూజర్లు ప్రధాన లక్ష్యం అవుతున్నారు. స్కామ్‌ల నుంచి సైబర్ అటాక్స్ వరకు వాట్సాప్ యూజర్లే హ్యాకర్లకు బలి అవుతున్నారు.
ఇప్పుడు మళ్లీ ‘సేఫ్‌ఛాట్’ అనే ఫేక్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా డివైస్‌ల్లోకి మాల్వేర్‌ను ఎక్కిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ వినియోగదారుల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను హ్యాకర్లకు చేరవేస్తుంది. కాల్ లాగ్స్, మెసేజ్‌లు, జీపీఎస్ లొకేషన్లను కూడా ఈ యాప్ ఎక్స్‌ట్రాక్ట్ చేస్తుంది.
టెలిగ్రాం, సిగ్నల్, వాట్సాప్, వైబర్, ఫేస్‌బుక్ మెసెంజర్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌ను టార్గెట్ చేసే ‘Coverlm’ అనే స్పైవేర్‌ను ఇందులో ఉంచినట్లు సమాచారం. CYFIRMA అనే సంస్థలోని రీసెర్చర్లు తెలుపుతున్న దాని ప్రకారం... ‘Bahamut’ అనే భారతీయ ఏపీటీ హ్యాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ హ్యాకింగ్ జరుగుతోంది. వాట్సాప్‌లో ఫిషింగ్ దాడులు చేసి మాల్‌వేర్‌ను వినియోగదారుల ఫోన్లలోకి పంపుతూ ఉంటారు. భారతదేశంలో పాటు దక్షిణ ఆసియా దేశాల్లో కూడా వీరి దాడులు జరుగుతూ ఉంటాయి.
మీ స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలా డేటాను దొంగిలిస్తారు?
1. మొదట హ్యాకర్లు మీ ఫోన్‌లో ‘సేఫ్‌ఛాట్’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేలా ప్రేరేపిస్తారు. అది నమ్మకమైన ఛాటింగ్ యాప్ అని చెప్తారు.
2. ఒకసారి మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాక యాక్సెసబిలిటీ సర్వీసెస్‌కు యాక్సెస్ అడుగుతుంది. ఈ ఒక్క పర్మిషన్‌తో కాంటాక్ట్ లిస్ట్, ఎస్ఎంఎస్, కాల్ లాగ్స్, ఎక్స్‌టర్నల్ డివైస్ స్టోరేజ్, జీపీఎస్ లొకేషన్ డేటాకు యాక్సెస్ లభిస్తుంది.
3. ఆ తర్వాత ఈ సేఫ్‌ఛాట్ యాప్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సబ్ సిస్టం పర్మిషన్ కూడా అడుగుతుంది. ఈ పర్మిషన్‌తో ఈ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా రన్ అవుతుంది.
4. మీ డివైస్‌లో ఉన్న ఛాట్ యాప్స్‌తో కూడా ఈ యాప్ ఇంటరాక్ట్ అవుతుంది. ఆ యాప్స్ నుంచి డేటాను దొంగిలిస్తుంది.
5. దొంగిలించిన డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయి వారి సీ2 సర్వర్‌కు చేరుకుంటుంది. ఎన్‌క్రిప్షన్ అవ్వడం వల్ల ఇదేం డేటానో ఎవరూ కనిపెట్టలేరు.
సురక్షితంగా ఎలా ఉండాలి?
సైబర్ అటాక్స్ అనేవి మనకు కొత్తేమీ కాదు కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సేఫ్‌ఛాట్ లాంటి ఫేక్ యాప్స్ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా యాప్స్‌ను ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గూగుల్ ప్లేస్టోర్ వంటి అధికారిక యాప్ స్టోర్స్ నుంచి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మంచిది.
దీంతోపాటు యాప్స్‌కు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా యాప్ దాని ఫీచర్లతో సంబంధం లేని సెన్సిటివ్ డేటా కోసం పర్మిషన్ అడిగితే దాన్ని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయడం మంచిది. మీ డివైస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. అలాగే మంచి పేరున్న యాంటీ వైరస్, సెక్యూరిటీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial