ChatGPT: యుఎస్ కంపెనీలలో ChatGPT వినియోగం, 50 శాతం ఉద్యోగాలకు ఎసరు - OpenAI సీఈవో కీలక హెచ్చరిక!
అమెరికాలోని సగానికిపైగా కంపెనీలు ChatGPTని ఉపయోగిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ChatGPT సృష్టికర్త, OpenAI CEO సామ్ ఆల్ట్ మాన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు.
టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, సాంకేతిక యుగంలో గేమ్ ఛేంజర్ అయిన చాట్‌జీపీటీ, టెక్ దిగ్గజాలు ఏళ్లు కష్టపడి సాధించిన ఘనతను, ఈ కొత్తతరం చాట్‌బాట్ కేవలం రెండు నెలల్లోనే సాధించింది. ఈ రెండు నెలల్లోనే 100 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుని సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ దెబ్బకు గూగుల్ కూడా బెదిరింది. చాట్‌జీపీటీ పూర్తి స్థాయిలో ప్రపంచ ప్రజల్లోకి వెళితే, గూగుల్ కనుమరుగవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విపత్కర పోటీని ఎదుర్కోవడానికి గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. చాట్‌జీపీటీ తరహా సేవలను త్వరలోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో పరిచయం చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొద్ది రోజుల క్రితం చెప్పారు. తాజాగా ChatGPT సృష్టికర్త, OpenAI CEO సామ్ ఆల్ట్ మాన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు.
OpenAI CEO సామ్ ఆల్ట్ మాన్ కీలక హెచ్చరిక
AI బాట్‌ని ఉపయోగించే US కంపెనీలలో సగానికిపైగా కంపెనీలు ChatGPTని ఉపయోగిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. 66 శాతం కోడ్ రాయడం కోసం, 58 శాతం కాపీ రైటింగ్, కంటెంట్ క్రియేషన్ కోసం, 57 శాతం కస్టమర్ సపోర్ట్ కోసం, 52 శాతం మీటింగ్ సమ్మరీలు, ఇతర పత్రాల కోసం ChatGPTని ఉపయోగిస్తున్నట్లు తెలిపాయి. అంతేకాదు, మానవుల ప్లేస్ లో ChatGPTని రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో OpenAI CEO సామ్ ఆల్ట్ మాన్ AI చాట్‌బాట్ పై ముఖ్యమైన విషయాలకోసం ఆధారపడకూడదని హెచ్చరించారు. AI సాంకేతికత వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆల్ట్ మాన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది.
ChatGPTని ఉపయోగిస్తున్న బిజినెస్ లీడర్స్
ఈ నెల ప్రారంభంలో జాబ్ అడ్వైజ్ ప్లాట్‌ఫారమ్ Resumebuilder.com USలోని 1,000 మంది బిజినెస్ లీడర్స్ ను సర్వే చేసింది. వారిలో చాలా మంది ChatGPTని ఉపయోగిస్తున్నారని, మరికొంత మంది ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారని ఫార్చ్యూన్ నివేదించింది. సర్వే చేసిన దాదాపు సగం కంపెనీలు ఇప్పటికే చాట్ బాట్‌ను ఉపయోగించడం ప్రారంభించాయని వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది బిజినెస్ లీడర్స్ ఇప్పటికే తమ కంపెనీలలోని కార్మికుల స్థానిన్న ChatGPT భర్తీ చేసిందని పేర్కొన్నారు. కంపెనీల యజమానులు ChatGPTని ఉపయోగించి కొన్ని ఉద్యోగ బాధ్యతలను క్రమబద్ధీకరించాలని చూస్తున్నారని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. మొత్తంగా చాలా మంది బిజినెస్ లీడర్స్ ChatGPT పని తీరుకు ముగ్దులైనట్లు తెలిపాయి. ChatGPT ద్వారా చేసే పని నాణ్యత అద్భుతంగా ఉందని 55 శాతం మంది చెప్పగా, 34 శాతం మంది చాలా బాగుందని చెప్పినట్లు వివరించారు.
ఇండియన్ కంపెనీలు ఏమంటున్నాయంటే?
భారతదేశంలో TCS వంటి కంపెనీలు ChatGPT వంటి ఉత్పాదక కృత్రిమ మేధస్సు ప్లాట్ ఫారమ్‌లు AI సహోద్యోగిని సృష్టిస్తాయి తప్ప ఉద్యోగాలను భర్తీ చేయవని వెల్లడించాయి. ఇటువంటి సాధనాలు ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడతాయని, అయితే కంపెనీల వ్యాపార నమూనాలను మార్చలేవని తెలిపాయి.
Read Also: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?