Jack Sweeney: మస్క్‌నే ఆటాడుకున్న కుర్రాడు - ఈసారి రష్యా మీద పడ్డాడు - ఏం చేశాడంటే?
గతంలో ఎలాన్ మస్క్ ప్రైవేట్ జెట్లను ట్రాక్ చేసి ఫేమస్ అయిన కుర్రాడు జాక్ స్వీనే ఇప్పుడు రష్యా బిలియనీర్ల జెట్లను ట్రాక్ చేస్తున్నాడు.
Jack Sweeney Tracking Russian Oligarchs Jets: ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రైవేట్ జెట్ వెళ్లే రూట్‌నే హ్యాక్ చేసి ట్విట్టర్‌లో పెట్టిన 19 సంవత్సరాల యువకుడు జాక్ స్వీనే గుర్తున్నాడు? ఇప్పుడు అతను తన గురి రష్యా వైపు తిప్పాడు. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో చదువుతున్న జాక్ స్వీనే కొత్తగా @RUOligarchJets అనే ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశాడు.
ఎయిర్ ట్రాఫిక్ డేటాను బోట్స్ ద్వారా సేకరిస్తూ... రష్యా కోటీశ్వరులకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్‌లను జాక్ స్వీనే ట్రాక్ చేస్తున్నాడు. ఈ డేటాను ఎప్పటికప్పుడు పైన తెలిపిన ట్విట్టర్ ఖాతాలో పెడుతున్నాడు. ఉక్రెయిన్‌లో రష్యా చొరబాటు తర్వాత కొంతమంది అడిగితే ఈ ఖాతాను తెరిచి అప్ డేట్స్ ఇస్తున్నట్లు జాక్ స్వీనే అంటున్నాడు. యుద్ధం మొదలవ్వక ముందు వీరి గురించి తనకు తెలియదని స్వీనే అన్నాడు.
బ్లూమ్‌బర్గ్ (Bloomberg) కథనం ప్రకారం... ‘రష్యాలో ఇంతమంది పవర్ ఉన్న కోటీశ్వరులు ఉన్నారని నాకు తెలీదు. వీరి దగ్గరున్న విమానాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. జెట్స్ కంటే ఇవి చాలా పెద్దవి.’ అని జాక్ స్వీనే అన్నాడు.
వ్లాదిమిర్ పోతానిన్, రోమన్ అబ్రమోవిచ్ (చెల్సీ ఫుట్ బాల్ క్లబ్ ఓనర్), అలెగ్జాండర్ అబ్రమోవ్ వంటి బిలియనీర్ల వద్ద కళ్లు చెదిరే ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉన్నాయి. జాక్ స్వీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా మొత్తంగా 39 విమానాలను ట్రాక్ చేస్తున్నాడు. ఇందులో 19 బిలియనీర్లకు చెందినవే. రాడార్ స్పోర్ట్స్ అనే బ్లాగ్ ట్రాక్ చేసే ప్లేన్లు, ప్రైవేట్ జెట్లు, హెలికాఫ్టర్ల జాబితా ద్వారా స్వీనే వీటిని ట్రాక్ చేస్తున్నాడు.
పుతిన్ ప్లేన్లను కూడా...
ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరిట రిజిస్టర్ అయిన ప్లేన్లను కూడా ట్రాక్ చేసేందుకు తన వద్ద ఒక రెండో ఖాతా కూడా ఉంది. అయితే రష్యాకు సంబంధించిన ఫ్లైట్ డేటా లిమిటెడ్‌గా ఉండటం కారణంగా ట్రాకింగ్ కష్టం అవుతోందని స్వీనే తెలిపాడు.
స్వీనే ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న దాని ప్రకారం అబ్రమోవిచ్ జెట్లలో ఒకటి ఆదివారం లాట్వియాలో ల్యాండ్ అయింది. తన హెలికాఫ్టర్లలో ఒకటి కరీబియన్ దీవుల్లో ట్రిప్‌లో ఉంది. ఒక విమానం ఇటీవలే అబుదాబిలో, మరొకటి మ్యూనిచ్‌లో లాంచ్ అయింది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!