Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -ఖేల్ రత్న,అర్జున అవార్టులు వెనక్కి
Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాను కూడా ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నికవడంతో వివాదం కొనసాగుతోంది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో దిగ్గజ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్ పాత్ పై పెట్టి పునియా నిరసన వ్యక్తం చేశారు. తాము గతంలో 40 రోజుల పాటు తీవ్రంగా ఉద్యమం చేశామని అందులో బ్రిజ్ భూషణ్ తన పలుకుబడితో తమని అణిచివేశారని ప్రధానిని ఉద్దేశిస్తూ బజ్ రంగ్ పునియా లేఖను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెజ్లర్లకు దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలవగా... తాజాగా సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు బ్రిజ్‌భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌సింగ్.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ తన ఖేల్‌రత్న అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నిర్ణయించుకుంది. ప్రభుత్వం రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేసినప్పటికీ ఆమె ఇలా స్పందించింది. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వినేశ్ ఫొగాట్ పేర్కొంది. లేఖను ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తన జీవితంలో ఈ అవార్డులకు విలువ లేదని పేర్కొంది. సంజయ్ సింగ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజ్‌రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను త్యజించారు.
మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation Of India )పై వివాదం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) సస్పెండ్ (Suspend) చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ, క్రీడా శాఖ నిబంధనలకు విరుద్ధంగా పోటీల నిర్వహణకు కొత్త అధ్యక్షుడు (President) సంజయ్ సింగ్ (Sanjay Singh) సిద్ధమయ్యారు. అండర్-15, అండర్-20 జాతీయ రెజ్లింగ్ పోటీలు నిర్వహించాలని ప్రకటన కూడా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నందినీ నగర్, గోండాలో ఈ నెలాఖరులోపు నిర్వహిస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా సంజయ్ సింగ్ ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. క్రీడా శాఖ రూల్స్ ను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Saran Singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 12ఏళ్ల పాటు రెజ్లింగ్ సేవలు అందించానని, క్రీడలతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు.