Ranji Trophy Postpone: ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్.. రంజీ ట్రోఫీ వాయిదా వేసిన బీసీసీఐ
Ranji Trophy Postpone: కరోనా వైరస్ వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీని తాత్కాలికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Ranji Trophy 2021-22 Postpone: దేశంలో మేజర్ క్రికెట్ టోర్నీ ఫస్ల్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌కు కరోనా వైరస్ సెగ తగిలింది. దేశంలో ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రంజీ తాజా సీజన్ తాత్కాలికంగా వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని ఏబీపీ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, గుజరాత్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు మరో అడుగు ముందుకేసి వీకెండ్ లాక్ డౌన్ విధించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీని బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, మహిళల టీ20 లీగ్ ప్రస్తుత సీజన్ లను తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రంజీ ఆటగాళ్లకు కరోనా..
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న రంజీ సీజన్ కోసం కోల్‌కతాలో బెంగాల్ జట్టు సాధన చేసింది. ఈ క్రమంలో ఏడుగురు సభ్యులకు కొవిడ్ సోకడంతో ప్రాక్టీస్ సెషన్లను రద్దు చేశారు. జనవరి 8న ఆరంభమయ్యే ఎలైట్ గ్రూప్ బి మ్యాచుల కోసం బెంగాల్ జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది.
కోల్‌కతాలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులు, ట్రైనింగ్ సెషన్లలో ఆటగాళ్లు, కోచ్ పాల్గొన్నారని సమాచారం. పాజిటివ్ అని తెలిసిన తర్వాత అందరినీ ఐసోలేషన్‌కు పంపించారు. ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబె, జట్టు వీడియో విశ్లేషకుడికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు.
రంజీలో పాల్గొనాల్సిన ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో ప్రస్తుతం టోర్నీ నిర్వహించడం సరికాదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా సోకిందని బెంగాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి దేవవ్రత దాస్ ఈఎస్‌పీఎన్‌కు తెలిపారు. సుదీప్ ఛటర్జీ, అనుష్టుప్ మజుందార్, కాజీ జునైద్ సైఫి, గీత్ పూరి, ప్రదీప్త ప్రమాణిక్, సుజిత్ యాదవ్, సహాయ కోచ్ సౌరాషిష్ లాహిరికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నారని క్యాబ్ సెక్రెటరీ స్నేహాశిష్ గంగూలీ తెలిపారు.
Also Read: IND Vs SA: హోరాహోరీగా సాగుతున్న తొలిటెస్టు.. రెండో రోజు ముగిసింది.. ఈ ఇద్దరే కీలకం!
Also Read: Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా
Also Read: AP Omicron Cases: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు... 24కు చేరిన మొత్తం కేసులు