గోపీచంద్ అకాడమీలో అవమానాలా- అందుకే సింధు బయటకు వచ్చేసిందా!
ఒక గొప్ప క్రీడాకారిణిగా పీవీ సింధు గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాలేంటి? ఆమె బయట ఎలా ఉంటుంది? ఏ హీరో ఇష్టం? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని చాలామందికి కుతూహలంగా ఉంటుంది.
పీవీ సింధు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పేరు. తన ఆటతో తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచిన అమ్మాయి. తనను చూసి ఎంతోమంది చిన్నారులు బ్యాడ్మింటన్ ఆట వైపు అడుగులు వేశారు. చిన్న వయసులోనే ఆటలో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకుంది. మహిళల సింగిల్స్ లో ఒలింపిక్ రజత, కాంస్య పతకాలు, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ లో 5 మెడల్స్, కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు ఇలా ఆమె ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నాయి.
మైదానంలో సింధు ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో మనందరికీ తెలుసు. బయట సింధు ఎలా ఉంటుంది? ఆమె ఇష్టాఇష్టాలేంటి? ఏ హీరో అంటే ఇష్టం? గోపీచంద్ అకాడమీ నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఏంటి? ఒక షో లో పాల్గొన్న ఈ ఛాంపియన్ వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చారు.
పతకం ముందు అవన్నీ చిన్నవే
ఆట కోసం.. ఫ్రెండ్స్ తో బయట తిరగడాలు, షాపింగ్ కి వెళ్లడాలు ఇవన్నీ మిస్ అవుతున్నాననే బాధ తనకు లేనేలేదని చెప్పింది సింధు. ఎందుకంటే టోర్నమెంట్ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు వాటికంటే ఎక్కువగానే తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఫిట్ నెస్ కోసం నచ్చిన ఆహారం తీసుకోకుండా ఉండడం కష్టమే అని కానీ గొప్ప విజయాలు సాధించాలంటే మాత్రం అలాంటి చిన్న చిన్న ఆనందాలు వదులుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే అలాంటి వాటి పెద్దగా బాధపడటం ఎప్పుడో మానేశానంటోందీ. దేశం కోసం పతకం గెలిచినప్పుడు వచ్చే సంతోషం కంటే అదేం పెద్దది కాదని పొంగిపోయింది. ఒకప్పుడు ఓటమి ఎదురైనప్పుడు చాలా బాధపడేదాన్ని. అయితే ఇప్పుడు గెలుపోటములు రెండింటినీ సమానంగా స్వీకరించడం నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సింధు.
నాకన్నీ వారిద్దరే
తన విజయాల్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందని చెప్పుకొచ్చింది. సింధు. ప్రతి విషయంలోనూ వారు తనకు మద్దతుగా నిలుస్తారని కావలసినవన్నీ సమకూరుస్తారు. గెలుపోటముల్లో అండగా ఉంటారని షోలో కాస్త ఎమోషన్ అయింది సింధు. తాను ఆటపై సీరియస్‌గా దృష్టి పెట్టి ఉంటే ఓ ఛాంపియన్ అయ్యేవాడినని తరచూ తన తండ్రి అంటూ ఉంటారని మురిసిపోయిందీ బ్యాడ్మింటన్ స్టార్.
సినిమా హీరోల్లో ప్రభాస్ ఇష్టం అంటూ చెప్పింది సింధు. ప్రభాస్ తాను మంచి ఫ్రెండ్స్‌మని కూడా సీక్రెట్ రివీల్ చేసింది. మిగతా హీరోల సినిమాలు కూడా చూస్తుంటానంటు వివరించింది.
అదే కారణం
ఈ ఛాంపియన్.. గోపీచంద్ అకాడమీ వదిలి వెళ్లడానికి గల కారణాలను వివరించింది. 'అక్కడ నాకు కొన్ని విషయాలు నచ్చలేదు. ఒక క్రీడాకారిణిగా నచ్చని విషయాలతో రాజీ పడలేను. అందుకే అక్కడ నుంచి వచ్చేశాను.' వివరించింది.