Virat Kohli: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఎక్కువ పతకాలు సాధించాలి - విరాట్ కోహ్లీ వీడియో పోస్ట్ చూశారా
India at Paris Olympics 2024 | త్వరలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఎక్కువ పథకాలు సాధించాలని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆకాంక్షించాడు. ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశాడు.
న్యూఢిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచ కప్ ముగిసింది. 17 ఏళ్ల తరువాత భారత్ పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. దేశమంతా ఆ విజయాన్ని చూసి గర్వించింది. స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లను సైతం బీసీసీఐ ఘనంగా సత్కరించింది. ముంబైలో అభినందన కార్యక్రమం సైతం నిర్వహించి, వారిని తగిన రీతిలో గౌరవించింది. త్వరలో మరో అతిపెద్ద క్రీడా సంబరాలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని పతకాలు గెలవాలని టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఆకాంక్షించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అథ్లెట్లకు విరాట్ కోహ్లీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
జులై 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి మరో 11 రోజుల సమయం ఉంది. ఒలింపిక్ కమిటీ విశ్వ క్రీడాసంబరాల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. జనాభా ఎక్కువగా ఉండే దేశం అయినప్పటికీ, విశ్వ వేదిక ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నా, కొన్ని పతకాలకే పరిమితం అవుతున్నారు. దాంతో ఇతర రంగాల క్రీడా ప్రముఖులు ఈసారి భారత్ సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్న అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. సోషల్ మీడియాలో విరాట్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
From dreams to medals.🏅
— Virat Kohli (@imVkohli) July 15, 2024
It's time to back our athletes as they step foot into Paris!✊🏼🇮🇳@IIS_Vijayanagar @StayWrogn #JaiHind #WeAreTeamIndia #Paris2024 #RoadToParis2024 #StayWrogn pic.twitter.com/pbi7TYWjsN
జై హింద్, గుడ్ లక్ ఇండియా
‘ఒకప్పుడు భారత్‌ను పాముకాట్లు, ఏనుగుల దేశంగా మాత్రమే పరిగణించేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. నేడు ప్రపపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ పేరు మార్మోగుతోంది. క్రికెట్‌తో పాటు బాలీవుడ్ (సినీ రంగం), స్టార్టప్ లతోపాటు పలు రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. గత కొన్నేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు దక్కించుకుంది. అలాంటి గొప్ప దేశం ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందంటే అది ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టడమే. పారిస్ ఒలింపిక్స్‌లో గతంలో కంటే ఎక్కువ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ మన అథ్లెట్లు సాధించాలి. మీ విజయాల కోసం, మీరు తీసుకొచ్చే పతకాల కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జై హింద్, గుడ్ లక్ ఇండియా అని విరాట్ కోహ్లీ తన వీడియో పోస్టులో రాసుకొచ్చాడు.
ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున 118 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఓ స్వర్ణం సహా ఏడు మెడల్స్ వచ్చాయి. ఆ ఓలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్‌త్రోలో స్వర్ణం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. వ్యక్తిగత అథ్లెటిక్స్‌లో స్వర్ణాల ఖాతాను తెరిచిన నీరజ్ చోప్రా.. మరోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నాడు. భారత్ ఈసారి సైతం తమకు కలిసొచ్చే బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్ విభాగాలలో సాధ్యమైనన్ని పతకాలు సాధించాలని భావిస్తోంది.