RCB Vs PBKS Final: బెంగళూరు-పంజాబ్ ఫైనల్ రద్దు అయితే ఛాంపియన్ ఎవరు అవుతారు? విజేతను ఎలా నిర్ణయిస్తారు?
RCB Vs PBKS Final: RCB అండ్ PBKS మధ్య IPL 2025 ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ రద్దు అయితే ఎవరు విజేత అవుతారో తెలుసుకోండి.

RCB Vs PBKS Final IPL 2025 ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ టైటిల్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో RCB లేదా పంజాబ్ కింగ్స్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే ఈరోజు మొదటిసారిగా ఛాంపియన్ అవుతుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది, అది వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కాబట్టి, ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రారంభం కాకపోతే ఫలితం ఎలా వస్తుంది?
మొదటగా, అహ్మదాబాద్ వాతావరణం గురించి చూద్దాం. మంగళవారం 64 శాతం వర్షం పడే అవకాశం ఉందని అంచనా. మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది . గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభంకానుంది. మ్యాచ్ సమయంలో మేఘాలు ఉండవచ్చు, కానీ వర్షం పడే అవకాశం తక్కువ.
మ్యాచ్ రద్దు అయితే ఫలితం ఎలా వస్తుంది?
బెంగళూరు-పంజాబ్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగాలి, కానీ వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకపోతే, నిబంధనల ప్రకారం రిజర్వ్ డేలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు జూన్ 4ని రిజర్వ్ డేగా నిర్ణయించారు. రిజర్వ్ డే కూడా వర్షం బారిన పడితే, మ్యాచ్ రద్దు చేస్తారు.
ఫైనల్ మ్యాచ్ రద్దు అయినట్లయితే, పంజాబ్ కింగ్స్ ఛాంపియన్‌గా, RCB రన్నర్‌గా ప్రకటిస్తారు. పాయింట్స్ టేబుల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే పంజాబ్ ముందు ఉంది. కాబట్టి పంజాబ్ విజేతగా ప్రకటిస్తారు. టేబుల్‌లో బెంగళూరు, పంజాబ్ రెండూ 19 పాయింట్లు సాధించాయి. కానీ పంజాబ్ నెట్ రన్ రేట్ (+0.372), RCB నెట్ రన్ రేట్ (+0.301) కంటే ఎక్కువ. ఇంతకు ముందు ఎప్పుడూ IPL ఫైనల్ మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి రాలేదు. రద్దు కాలేదు కూడా. కానీ IPL 2025 ఫైనల్‌లో వర్షం పడితే, పంజాబ్ మ్యాచ్ ఆడకుండానే ఛాంపియన్ అవుతుంది.
బెంగళూరుకు గుడ్ న్యూస్-సాల్ట్ వచ్చేశాడు.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ నుంచి అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చాడు. అతను నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఫైనల్‌లో ఆడుతున్నాడు. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిసి ఇంగ్లండ్ వెళ్లాడు. సోమవారం అతను ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేదు. అందుకే సాల్ట్ ఫైనల్ మ్యాచ్‌కు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సాల్ట్ గురించి తాజా అప్‌డేట్ వచ్చింది. సాల్ట్ ఇంగ్లాండ్ నుంచి అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చాడు. పంజాబ్‌పై జరిగే ఫైనల్‌లో కూడా ఆడతాడు.
"పంజాబ్ గెలుస్తుంది"
ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ ఒక బోల్డ్ జోస్యం చెప్పాడు, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ను ఓడించి తమ తొలి టైటిల్‌ను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. "పంజాబ్ జట్టు విరాట్‌ను త్వరగా అవుట్ చేయకపోతే, వారు పెద్ద ఇబ్బందుల్లో పడతారు" అని యోగరాజ్ ANI కి చెప్పారు. "అతను కొనసాగితే, 250 లేదా 300 పరుగులను కూడా ఛేదించగలడు. పంజాబ్ గెలుస్తుందని నా అంతరాత్మ చెబుతోంది. కానీ ఇదంతా వారు కోహ్లీని ఎంత త్వరగా అవుట్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది."



















