Virat Kohli: 14 సీజన్లలో మూడు సార్లు - ఈ ఒక్క సీజన్లోనే మూడు సార్లు - కొనసాగుతున్న విరాట్ పేలవ ఫామ్!
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన మొదటి బంతికే డకౌట్ కావడం ఇది విరాట్‌కు ఇది మూడోసారి. ఇంతకు ముందు 14 సీజన్లు ఆడిన విరాట్ మొత్తంగా మూడు సార్లు గోల్డెన్ డక్ కాగా... ఈ ఒక్క సీజన్లోనే మూడు సార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. గత కొంతకాలంగా కొనసాగుతున్న విరాట్ పేలవ ఫాంను ఇది తెలియజేస్తుంది.
టాప్ రన్ స్కోరర్లలో ఎప్పుడూ టాప్-5 లేదా 10లో ఉండే కోహ్లీ ఈసారి ఏకంగా 32వ స్థానానికి పడిపోయాడు. 12 ఇన్నింగ్స్‌లో తను చేసింది కేవలం 216 పరుగులు మాత్రమే. బ్యాటింగ్ యావరేజ్ 19.64 కాగా... స్ట్రైక్ రేట్ 111.64గా ఉంది. 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఫాంలో లేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఈ నంబర్సే చెబుతున్నాయి.
విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో గోల్డెన్ డక్ అయిన సందర్భాలు ఇవే..
1. 2008లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో - ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో
2. 2014లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో - సందీప్ శర్మ బౌలింగ్‌లో
3. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో - నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో
4. 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో - దుష్మంత చమీర బౌలింగ్‌లో
5. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో - మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో
6. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో - జగదీష సుచిత్ బౌలింగ్‌లో
మ్యాచ్ విషయానికి వస్తే... బెంగళూరు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జగదీష సుచిత్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విరాట్ తడబడుతున్న సంగతి తెలిసిందే. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ చేజార్చుకోవడంతో బెంగళూరు వెనబడుతుందేమో అనిపించింది. అయితే డుప్లెసిస్ (73 నాటౌట్: 50 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), రజత్ పాటిదార్ (48: 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) మెరుపు షాట్లు ఆడుతూ దుమ్మురేపారు. కేవలం 6.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసేశారు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అందించారు. 13వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి రజత్ ఔటయ్యాడు. దాంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో (33: 24 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి డుప్లెసిస్ చెలరేగాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 37 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ (30 నాటౌట్: 8 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) మూడు సిక్సర్లు, ఒక బౌండరీ కొట్టడంతో స్కోరు 192/3కు చేరుకుంది.