IPL2024 : వరుణుడు ఆగాలి- సూర్య సేన రెచ్చిపోవాలి
SRH vs LSG IPL2024 : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.
SRH vs LSG, Preview and Prediction : ఇది అలాంటి ఇలాంటి మ్యాచ్ కాదు. ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయా... లేక మరింత క్లిష్టంగా మారి ప్లే ఆఫ్‌కు చేరుకుండానే వెనుదిరుగుతారా అని తేల్చే మ్యాచ్. అంతటి కీలకమైన మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)... లక్నో సూపర్ జెయింట్స్(LSG) సిద్ధపడ్డాయి. ఈ ఐపీఎల్(IPL) సీజన్‌లో ఇప్పుడు ఇరు జట్లు ఒకే దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ 11 మ్యాచ్‌లు ఆడి.. ఆరు విజయాలు... అయిదు పరాజయాలతో 12 పాయింట్లతో సమంగా ఉన్నాయి. సేమ్ పాయింట్లు ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌తో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. రన్‌రేట్ తక్కువగా ఉండడంతో లక్నో అయిదో స్థానంలో ఉంది. రెండు జట్లు కూడా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్‌రేట్‌తో కచ్చితంగా రెండు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఏ టీమ్ విజయం సాధిస్తే వారికే ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
సొంత మైదానంలో...
హైదరాబాద్‌లోని(Hyderabad) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Rajiv Gandhi International Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ఆరంభంలో మెరుపులు మెరిపించిన గత కొన్ని మ్యాచుల్లో విఫలమవుతోంది. సన్‌రైజర్స్ తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. ట్రావిస్ హెడ్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవుతుండడం హైదరాబాద్‌ను ఆందోళనపరుస్తోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గత నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా కీలకసమయంలో వరుసగా విఫలమవుతున్నారు. నటరాజన్ బంతితో స్థిరంగా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది.
లక్నో కూడా అంతే
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో తేలిపోయింది. ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా 200కుపైగా పరుగులు చేయగా లక్నో 137 పరుగులకే పరిమితమైంది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ అవసరమైన వేళ రాణించకపోవడం లక్నోను వేధిస్తోంది. ఆయుష్ బదొని కూడా తేలిపోతున్నాడు. లక్నో పేస్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. పేసర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్‌కు దూరం కావడంతోపాటు ఎడమచేతి వాటం పేసర్ మొహ్సిన్ ఖాన్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, స్టోయినిస్, స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్‌లు రాణించాలని లక్నో కోరుకుంటోంది.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరాక్ మన్కడ్, అర్షద్ ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి.