IPL 2025 Re Start Updates: ఐపీఎల్ రీస్టార్ట్.. ఆటగాళ్ల లభ్యతపై ఫ్రాంచైజీల్లో గుబులు.. కొన్ని జట్లకు మోదం.. మరికొన్ని జట్లకు ఖేదం..
IPL 2025 Latest Updates: దాయాది పాక్ తో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్.. తాజాగా రీ స్టార్ట్ కాబోతోంది. అయితే ఆటగాళ్ల లభ్యతపై పలు ప్రాంచైజీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

IPL 2025 KKR VS RCB Updates: శనివారం నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ కానుండటంతో టోర్నీలో బరిలోకి దిగే ఆటగాళ్లపై స్పష్టత వస్తోంది. కొన్ని జట్లకు గుడ్ న్యూస్ లు ఎదురుకాగా, మరికొన్ని జట్లు మాత్రం షాక్ తిన్నాయి. ముఖ్యంగా రీ స్టార్ట్ తర్వాత జట్టు కూర్పు విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తంటాలు పడుతోంది. ఆ జట్టు ప్రీమియర్ పేసర్ మిషెల్ స్టార్క్ సేవలు దూరం కానున్నాయి. తను ఈ సీజన్ లో బాగానే రాణించాడు. 11 మ్యాచ్ లు ఆడి 14 వికెట్లకు కొల్లగొట్టాడు. ఈ సీజన్ లో ఢిల్లీకి మరో మూడు మ్యాచ్ లు మిగిలి ఉండటంతో స్టార్క్ దూరం కావడం ఆ జట్టుకు శాపంగా మారనుంది. అలాగే వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా అందుబాటులోకి వచ్చే దానిపై స్పష్టత లేదు. అంతర్జాతీయంగా రిటైర్ అయినప్పటికీ, ఈ రీ స్టార్ట్ లో ఆడటం మాత్రం ఇప్పటివరకు సందేహాస్పదంగా ఉంది. అలాగే సౌతాఫ్రికా పేసర్ దోనేవాన్ ఫెరీరా మాత్రం ఈ సీజన్ లో ఆడటం లేదు. ఈ సీజన్ లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఫెరీరా.. ఆ తర్వాత బరిలోకి దిగలేదు. తాజాగా టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు
జోష్ లో ముంబై..
ఇక ముంబై ఇండియన్స్ మాత్రం ఉత్సాహంగా ఉంది. వన్ డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ రీ స్టార్ట్ కు అందుబాటులో ఉంటున్నాడు. ముంబై ఆడబోయే మిగతా రెండు మ్యాచ్ లకు తను అందుబాటులో ఉంటున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. తను భారత్ కు వస్తున్న విమాన టికెట్లను సైతం ప్రదర్శనకు ఉంచాడు. ఈ సీజన్ లో ముంబై సత్తా చాటడంలో జాక్స్ తన వంతు పాత్ర పోషించాడు. తనకు అప్పగించిన వన్ డౌన్ బ్యాటర్ పాత్రను చక్కగా పోషించాడు. అయితే లీగ్ మ్యాచ్ ల తర్వాత వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు తను స్వదేశం ఇంగ్లాండ్ కు వెళ్లిపోతాడు. దీంతో ప్లే ఆఫ్స్ కు అతని సేవలు అందుబాటులో ఉండవు. గుజరాత్ టైటాన్స్ కూడా ఇదే ఇబ్బంది పడుతోంది. నాకౌట్ కు జట్టు చేరితే జోస్ బట్లర్ సేవలు అందుబాటులో ఉండవు.
పంజాబ్ కు హుషారు..
పంజాబ్ కింగ్స్ జట్టుకు మేటి బ్యాటర్లు అయిన జోష్ ఇంగ్లీస్, ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా అందుబాటులో ఉంటున్నారు. అయితే ఈనెల 18న జరిగే మ్యాచ్ కు మాత్రం వీరిద్దరూ అందుబాటులో ఉండటం లేదు. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు టాప్ -4లో వరుసగా గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లకు ప్లే ఆఫ్ బెర్త్ సాధించే అవకాశముంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ కు మాత్రమే చాలా లిమిటెడ్ గా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జట్లు ఒక్క పరాజయం పాలైనా నాకౌట్ అవకాశాలు గల్లంతు అవతాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి తప్పుకున్నాయి. సన్ రైజర్స్ కి మూడు మ్యాచ్ లు ఉండగా, రాజస్థాన్, చెన్నే మరో రెండు మ్యాచ్ లు ఆడుతాయి. ఈనెల రెండో వారాలో దాయాది పాకిస్థాన్ తో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ కి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇక శనివారం నుంచి కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ రీ స్టార్ట్ కానుంది.




















