IPL 2024: జూలు విదిల్చిన ముంబై బ్యాటర్లు - ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
MI vs DC IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్లు మంచి పునాది వేశారు.
MI vs DC IPL 2024 Delhi Capitals Target 235: ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్లు మంచి పునాది వేశారు. మిడిల్ ఆర్డర్‌లో కాస్త తడబడినా చివర్లో ముంబై పుంజుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ రాణించారు. రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ముంబై స్కోరు 200 దాటింది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
బ్యాటింగ్ సాగిందిలా...
ముంబై ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించారు. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. తొలి ఓవర్‌ను ఏడు పరుగులు వచ్చాయి. తర్వాత ముంబై స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఇషాంత్ 14 పరుగులు ఇచ్చాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో బౌండరీ కొట్టారు. జే రిచర్డ్‌సన్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ రెండు సిక్స్‌లు బాదడంతో ముంబై స్కోరు 4 ఓవర్లకు 46 పరుగులకు చేరింది. అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ సిక్స్, ఫోర్ కొట్టాడు. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ దూకుడుకు ముంబై పవర్‌ప్లే ముగిసే సరికి ఒక్క వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో అక్షర్ పటేల్.. ముంబైకి షాక్ ఇచ్చాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. దీంతో 80 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది.
సూర్య ఇలా వచ్చి అలా ..
ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ రెండో బంతికే అవుటై నిరాశ పరిచాడు. ఎన్నో అంచనాల మధ్య వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్... నోకియా బౌలింగ్‌లో ఫ్రేజర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. ఆరు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో ముంబై స్కోరు మందగించింది. దీంతో 81 పరుగుల వద్ద ముంబయి రెండో వికెట్‌ను కోల్పోయింది. సూర్య అవుటయ్యే సమయానికి 8 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 84/2. 9వ ఓవర్‌లో ముంబై స్కోరు వంద దాటింది. ముంబై 111 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రిటర్న్ క్యాచ్ ఇచ్చి 42 పరుగులు చేసిన ఇషాన్ ఔటయ్యాడు.
వెంటనే మరో వికెట్ నేలకూలింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్‌లో తిలక్ వర్మ... అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
టిమ్ డేవిడ్ విధ్వంసం...
పరుగుల రాక కష్టంగా ఉండటంతో హార్దిక్, టిమ్ డేవిడ్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. అనంతరం టిమ్ డేవిడ్ దూకుడు పెంచాడు. జే రిచర్డ్‌సన్ వేసిన ఈ ఓవర్‌లో సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలో పాండ్యా 39 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ టిమ్ డేవిడ్, షెపర్డ్ మెరుపులు మెరిపించారు. టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45, షెపర్డ్ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.