IPL 2024: ముంబై బ్యాటర్లపై పతిరాన పంజా, రోహిత్ అద్భుత శతకం వృథా
MI vs CSK: రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్ పతిరన నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు.
Chennai Super Kings won by 20 runs : ముంబై ఇండియన్స్(MI)పై చెన్నై సూపర్ కింగ్స్(CSK) పంజా విసిరింది. వారిని వారి సొంత మైదానంలోనే ఓడించింది. రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్ పతిరన నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. దీంతో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ అజేయ శతకంతో మెరిశాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేసిన చివరి వరకూ అజేయంగా క్రీజులో నిలబడ్డ రోహిత్... ముంబైను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.,.. శివమ్ దూబే మెరుపు బ్యాటింగ్‌తో చెన్నై భారీ స్కోరు చేసింది. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది. అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రోహిత్ శర్మ శతకంతో 186 పరుగులు చేయగలిగింది. ముంబైలో మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయ దుంధుభి మోగించింది.
మెరిసిన ధోనీ, దూబే, రుతురాజ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అజింక్యా రహానే రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఎనిమిది బంతుల్లో ఒక ఫోర్‌తో అయిదు పరుగులు చేసిన రహానేను... కోయిట్జే అవుట్ చేశాడు. పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు. అనంతరం రచిన్ రవీంద్ర-రుతురాజ్ గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 52 పరుగులు జోడించారు. బలపడుతున్న ఈ జోడీని శ్రేయస్స్ గోపాల్ విడదీశాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.... శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో ఇషాన్‌కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్- శివమ్ దూబే ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో కాస్త తడబడ్డ ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో అలరించారు. ఈ క్రమంలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 33 బంతుల్లో ఆర్థ శతకం అందుకున్నాడు. కొయిట్జే వేసిన ఓవర్‌లో నాలుగో బంతిని సిక్స్ బాది రుతురాజ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శివమ్ దూబే కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. రొమారియో షెపర్డ్ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ క్రమంలో శివమ్ దూబే కేవలం 28 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దూబే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రుతురాజ్ అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రుతురాజ్ అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. చివరి వరకూ క్రీజులో నిలిచిన శివమ్ దూబే 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డేరిల్ మిచెల్ 14 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ధోనీ చివర్లో మెరుపులు మెరిపించాడు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది. రుతురాజ్ గైక్వాడ్, దూబే, ధోనీ చెలరేగడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
రోహిత్ ఒక్కడే...
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు అదిరే ఆరంభం దక్కింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ముంబైకు మంచి ఆరంభం దక్కింది. వీళ్లిద్దరూ ఏడు ఓవర్లకు వీరిద్దరూ 70 పరుగులు జోడించారు. ఇషాన్-రోహిత్ చెన్నై బౌలర్లకు ఎదురుదాడికి దిగారు. కానీ పతిరాన రాకతో ముంబై లయ దెబ్బతింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన పతిరాన ముంబైను దెబ్బకొట్టాడు. 23 పరుగులు చేసి ఇషాన్ కిషన్, సున్నా పరుగులకే సూర్యకుమార్ యాదవ్, 31 పరుగులు చేసి తిలక్ వర్మ పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులకే హార్దిక్ పెవిలియన్ చేరాడు. ముంబై బ్యాటర్లు విఫలమైనా... రోహిత్ శర్మ మాత్రం ఒంటరి పోరు చేశాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో అజేయ శతకంతో హిట్‌మ్యాన్ చివరి వరకూ పోరాడాడు. రోహిత్‌కు అవతల బ్యాటర్ల నుంచి మద్దతు కరువైంది. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.