KKR Vs GT: కోల్‌కతాపై గుజరాత్ సూపర్ విక్టరీ - ఏడు వికెట్లతో హార్దిక్ సేన విజయం!
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు వికెట్లతో ఓటమి పాలైంది.
Kolkata Knight Riders vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్ 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ బ్యాటర్లలో విజయ్ శంకర్ (51 నాటౌట్: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బ్యాటర్లలో ఓపెనర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (81: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) అత్యధిక స్కోరును సాధించాడు.. గుజరాత్ బౌలర్లలో షమి మూడు వికెట్లు తీసుకున్నాడు.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభం అయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (49: 35 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అయితే మొదటి వికెట్‌కు 4.1 ఓవర్లలోనే 41 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా (26: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.
అనంతరం రెండు పరుగుల వ్యవధిలోనే హార్దిక్, గిల్ ఇద్దరూ అవుటయ్యారు. అయితే విజయ్ శంకర్ (51 నాటౌట్: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (32 నాటౌట్: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) ఇద్దరూ కలిసి వేగంగా ఆడుతూ మ్యాచ్‌ను గెలుపు వైపు నడిపించారు. నాలుగో వికెట్‌కు కేవలం 39 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. దీంతో గుజరాత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.
వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభం అయిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నారాయణ్ జగదీషన్ (19: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 23 పరుగులు మాత్రమే.
ఆ తర్వాత వచ్చిన వారిలో కూడా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్‌కు వెళ్తుంటే మరో ఎండ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్ (81: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ గుర్బాజ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత ఆండ్రీ రసెల్ (34: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
A 🔝 of the Table victory in Kolkata for the @gujarat_titans 🙌🏻
— IndianPremierLeague (@IPL) April 29, 2023
They ace the chase yet again to register their fourth away win in a row 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/sR5TSGeJ94