IPL 2024 : హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరినట్లేనా? ప్లే ఆఫ్ రేసు ఎలా ఉందంటే!
Sunrisers Hyderabad: రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్‌లో స్థానం కోసం తిరిగి పోటీలో నిలిచింది. కానీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే మార్గం అనిశ్చితిగానే ఉంది.
IPL Playoffs Race After SRH vs RR: సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్(RR)పై నిన్నటి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగుతో విజయం సాధించిన తర్వాత... పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. రెండు వరుస పరాజయాల తర్వాత సన్‌రైజర్స్ కీలకమైన మ్యాచ్‌లో చివరి బంతికి అద్భుత విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు ఆరు విజయాలు... నాలుగో ఓటములతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదుసార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఒక స్థానంలో పైనే నిలిచింది. .
ప్లే ఆఫ్ ఆశలు సజీవం
రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్‌లో స్థానం కోసం తిరిగి పోటీలో నిలిచింది. నాలుగు స్థానంలో నిలిచినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే మార్గం ఇప్పటికీ అనిశ్చితిగానే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లో నాలుగు వేర్వేరు జట్లతో తలపడుతుంది. తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, ఎనిమిదో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్‌కు చేరుతుంది. హైదరాబాద్ ప్రస్తుతం 6 విజయాలతో 12 పాయింట్లను కలిగి ఉంది. IPL ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి ఒక జట్టు సాధారణంగా కనీసం 16 పాయింట్లు అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్ల మార్కుకు చేరుకోవడానికి మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించాలి. అయినా వారి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడం కొంచెం క్లిష్టంగానే ఉంది. ప్రస్తుతం IPL 2024 ప్లేఆఫ్ రేసులో వివరీతమైన పోటీ ఉంది. తక్కువ స్థానాల్లో ఉన్న జట్లు ఊహించని విజయాలు సాధిస్తే అప్పుడు ప్లే ఆఫ్ రేసు ఇంకా రసవత్తరంగా మారనుంది.
హైదరాబాద్ మ్యాచ్‌లు ఇలా...
ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్.. మే 6 (సోమవారం)
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్.. మే 8 (బుధవారం)
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్.. మే 16 (గురువారం)
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్... మే 19 (ఆదివారం)
ఉత్కంఠ విజయం
సొంత స్టేడియంలో హైదరాబాద్ అదరగొట్టేసింది. హోరాహోరీగా రాజస్థాన్‌తో జరిగిన పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ , యశస్వి జైస్వాల్ లు చెలరేగి అర్ధశతకాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది . హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు.