IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!
IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం నిర్వహించిన మెగా వేలంలో బీసీసీఐకి కాసుల పంట పండింది. 5 ఏళ్లకుగానూ రూ. 44,075 వేల కోట్లు బీసీసీఐకి సమకూరాయి.
IPL Media Rights: క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మీడియా హక్కుల కోసం నిర్వహించిన మెగా వేలంలో బీసీసీఐకి కాసుల పంట పండింది. వచ్చే ఐదేళ్ల కోసం... అంటే 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ మొత్తం 4 ప్యాకేజీల్లో మీడియా హక్కులను వేలానికి పెట్టింది. అందులో అతి ముఖ్యమైన తొలి రెండు... టీవీ, డిజిటల్ హక్కుల వేలం పూర్తయ్యేసరికే 5 ఏళ్లల్లో 410 మ్యాచుల కోసం 44 వేల 75 కోట్ల రూపాయాలు (రూ. 44,075 వేల కోట్లు) బీసీసీఐకి సమకూరాయి. టీవీ రైట్స్ డిస్నీ స్టార్, డిజిటల్ హక్కులను వయాకాం 18 దక్కించుకున్నట్లు సమాచారం.
మళ్లీ స్టార్ చేతికే టీవీ హక్కులు..
ఐపీఎల్ మ్యాచ్‌ల టీవీ హక్కులను స్టార్ సంస్థే మళ్లీ గెలుచుకుందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. టీవీ హక్కులను ఒక్కో మ్యాచ్‌కు 57.5 కోట్ల రూపాయల చొప్పున డిస్నీ స్టార్ సంస్థ దక్కించుకుంది. అదే సమయంలో డిజిటల్ హక్కులను మ్యాచ్ కు 50 కోట్ల రూపాయల చొప్పున వయాకాం 18 దక్కించుకున్నట్టు ఆయన తెలిపారు. అంటే టీవీ, డిజిటల్ హక్కుల వేలంతో ఒక్క మ్యాచ్ కు 107.5 కోట్ల రూపాయలు బీసీసీఐకి వస్తాయి.
పెండింగ్‌లో మరో రెండు విభాగాల వేలం
ఇంకా మరో 2 విభాగాల ఈ-వేలం పెండింగ్‌లో ఉంది. అదే నాన్-ఎక్స్ క్లూజివ్ డిజిటల్ కేటగిరీ, ఇండియా మినహా మిగతా దేశాల్లో మీడియా హక్కులు. నాన్ -ఎక్స్ క్లూజివ్ కేటగిరీ అంటే.... కొన్ని సెలెక్టెడ్ మ్యాచ్‌లకు మాత్రమే డిజిటల్ హక్కుల కోసం వేలం నిర్వహించనున్నారు. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్, రోజుకు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు సాయంత్రం మ్యాచ్, ప్లే ఆఫ్స్.... ఇలా సీజన్ లో కేవలం ఈ మ్యాచ్‌లను మాత్రమే డిజిటల్‌లో ఐపీఎల్ ప్రసారం చేసే హక్కులు పొందవచ్చు. ఈ రెండు విభాగాల ఈ-వేలం పూర్తయ్యేసరికి మొత్తం హక్కుల విలువ 50 వేల కోట్ల రూపాయలు అయ్యే అవకాశమున్నట్టు బీసీసీఐ అంచనా వేస్తోంది.
ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి వేలం ఇలా..
ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో 10 సంవత్సరాలకు కలిపి సోనీ పిక్చర్ రూ.8,200 కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసింది. 2015లో నోవి డిజిటల్ అనే సంస్థకు గ్లోబల్ డిజిటల్ రైట్స్‌ను రూ.302.2 కోట్లకు బీసీసీఐ విక్రయించింది. 2018లో మీడియా హక్కుల వేలం పూర్తయ్యేసరికి బీసీసీఐకి అందిన మొత్తం 16వేల 347 కోట్ల రూపాయలు. ఇప్పుడు కేవలం 2 విభాగాలకే 44 వేల కోట్ల రూపాయలకు పైగా బీసీసీఐకి ఆదాయం సమకూరింది. పెండింగ్ రెండు విభాగాలకు వేలం పూర్తయితే ఇది 50 వేల కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది.