IPL 2025 Interesting Qualifier1 Race: రసవత్తరంగా క్వాలిఫయర్-1 రేసు.. బరిలోని నాలుగు జట్లకు అవకాశం.. ఆర్సీబీకి సానుకూలత
ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు తర్వాత క్వాలిఫయర్-1 కి అర్హత ఎవరు సాధిస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ, ముంబై జట్లు ఈ దశకు అర్హత సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

IPL 2025 GT, PBKS, RCB, MI Updates: ఐపీఎల్ 2025 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చింది. ఇప్పటివరకు ఏయే జట్లు నాకౌట్ కు చేరాయో, ఏవేవీ టోర్నీలో ఈ దశ నుంచి నిష్క్రమించాయో అందరికీ ఒక ఐడియా వచ్చింది. ప్లే ఆఫ్స్ కు వరుసగా గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అర్హత సాధించగా, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఒక్కో జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే ప్లే ఆఫ్ జట్లపై ఓ ఐడియా వచ్చిన క్వాలిఫయర్ 1లో ఆడే జట్లేవో ఇంకా స్పష్టత రాలేదు. నాలుగు జట్లకు ఈ అవకాశం ఉండటం విశేషం. క్వాలిఫయర్ 1కి అర్హత సాధించిన జట్లకు ఫైనల్ కు చేరేందుకు మరో అవకాశం ఉండటమే దీనికి కారణం. ప్రజెంట్ గుజరాత్ 18 పాయింట్లతో ఉండగా, పంజాబ్, ఆర్సీబీ 17 , ముంబై 16 పాయింట్లతో నిలిచాయి. క్వాలిఫయర్ 1కు చేరాలంటే ఈ నాలుగు జట్లు తమ తర్వాతి మ్యాచ్ ల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. ఇక లీగ్ లో ఆయా జట్లకు ఒక్క మ్యాచే మిగిలి ఉండటం విశేషం.. తమ చివరి మ్యాచ్ లో చెన్నైతో గుజరాత్, ముంబైతో పంజాబ్, లక్నోతో ఆర్సీబీ తలపడనున్నాయి.
చెన్నైకి చెక్ పెట్టాలి..
ఈ నాలుగు జట్లలో ముందుగా ప్లే ఆఫ్ కు చేరిన గుజరాత్ గురించి చెప్పాలంటే.. ఆదివారం చెన్నైపై విజయం సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే 20 పాయింట్లతో నేరుగా క్వాలిఫయర్ 1కు అర్హత సాధిస్తుంది. లేకపోతే రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే అవకాశముంది. ఆ తర్వాత సోమవారం పంజాబ్- ముంబై మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ క్వాలిఫయర్ 1 డిసైడర్ అనొచ్చు. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే , ఆ జట్టు క్వాలిఫయర్ 1కి అర్హత సాధిస్తుంది. పంజాబ్ గెలిస్తే 19 పాయంట్లతో ముందంజ వేయగా, ముంబై గెలిస్తే 18 పాయింట్లు సాధిస్తుంది. అయితే తిరుగులేని నెట్ రన్ రేట్ (+1.292) ఉండటం ముంబైకి ప్లస్ పాయింట్. అయితే ఈ రెండు జట్లు గెలిచినా, ఆర్సీబీకి క్వాలిఫయర్ 1కి చేరే అవకాశం ఉంది..
రెండు సమీకరణాలు..
ఒకవేళ ముంబై గెలిస్తే, ఆర్సీబీకి సమీకరణం చాలా ఈజీగా ఉంటుంది. చివరి మ్యాచ్ లో లక్నోపై విజయం సాధిస్తే సరిపోతుంది. అయితే ఒకవేళ పంజాబ్ గెలిస్తే మాత్రం.. భారీ తేడాతో లక్నో పై విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక లీగ్ లో ఆఖరి మ్యాచ్ ను ఆర్సీబీ ఆడటనుండటంతో ఆ జట్టుకు సమీకరణం చాలా అనుకూలంగా ఉంటుంది. పంజాబ్/ ముంబై ఎవరూ గెలిచినా, సమీకరణం బట్టి, ఆడితే సరిపోతుంది. దీంతో ఈ సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్ లో అందరి ఫోకస్ నెలకొంది. ఇక ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ కు చేరిన ముంబై ఐదుసార్లు చాంపియన్ గా నిలవగా, 2022లో ఒకే ఒక్కసారి గుజరాత్ విజేతగా నిలిచింది. ఇక ఆర్సీబీ మూడుసార్లు, పంజాబ్ ఒక్కసారి రన్నరప్ గా నిలిచి, కప్పుకు ఒక్క అడుగు దూరంలో నిలిచి పోయింది.




















