IPL 2024: రికార్డుల్లో ముంబైదే పైచేయి! కానీ ఢిల్లీ క్యాపిటల్స్ పంజా విసురుతుందా?
MI vs DC: ఇప్పటిదాకా ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై గెలుపు రుచిని చూడలేదు. ఢిల్లీ కూడా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని మాత్రమే సాధించింది.

IPL 2024 MI vs DC Match Head to Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సీజన్‌లో 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో ముంబై ఇండియన్స్(MI) తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని ముంబై గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటిదాకా ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై గెలుపు రుచిని చూడలేదు. ఢిల్లీ కూడా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని మాత్రమే సాధించింది.
ఈ రెండు జట్ల రికార్డులివీ...
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీ జట్లు 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ పోరుల్లో ముంబై ఇండియన్స్ 18 మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. ఫలితం రాని మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ముంబైలో ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ అయిదుసార్లు విజయం సాధించగా.. ఢిల్లీ మూడు మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీలో ముంబై-ఢిల్లీ జట్లు 11 మ్యాచుల్లో తలపడగా.. ఢిల్లీ 6 సార్లు... ముంబై 5సార్లు గెలిచాయి.
వాంఖడే పిచ్ ఎలా ఉంటుందంటే..?
ముంబై పిచ్ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్‌లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. వాంఖడేలో ఐపీఎల్‌లో మొత్తం 110 మ్యాచ్‌లు జరగగా అందులో 50 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. 60సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. సాయంత్రం ప్రారంభంలో గాలి వీచే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. పిచ్ పొడిగా ఉంటుంది కాబట్టి, ఇది స్పిన్నర్లకు సహాయపడవచ్చు. ఏప్రిల్ 7న ముంబైలో ఆకాశం మేఘావృతమై ఉండదు. ఉష్ణోగ్రతలు 34 నుంచి 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తేమ 24 శాతం నుంచి సాయంత్రం 40 శాతానికి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలపనుంది.
గత మ్యాచ్‌లో ఇలా...
ఐదుసార్లు IPL ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్... ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై అట్టడుగున ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 106 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో, వారు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగారు. ప్రస్తుతం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
పంత్‌పైనే చూపంతా
స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వరుసగా రెండు అర్ధసెంచరీలు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 152 పరుగులు చేసిన పంత్ భారీ స్కోరు చేయాలని చూస్తున్నాడు. కానీ ఢిల్లీని బలహీనమైన బౌలింగ్ ఆందోళన పరుస్తోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ 272 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 148 పరుగులు చేయగా, ట్రిస్టన్ స్టబ్స్ పర్వాలేదనిపిస్తున్నాడు. వాంఖడే స్టేడియం హోమ్‌గ్రౌండ్ అయిన పృథ్వీ షా భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఢిల్లీ కోరుకుంటోంది.




















