Naveen-ul-Haq: స్టేడియంలో కోహ్లీ.. కోహ్లీ.. జపం! తనకెలా ఉంటుందో చెప్పిన నవీన్ ఉల్ హఖ్!
Naveen-ul-Haq: స్టేడియంలో అభిమానులు విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు జపిస్తే తనకు ఇబ్బందేమీ లేదని లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హఖ్ అంటున్నాడు.
Naveen-ul-Haq, IPL 2023:
స్టేడియంలో అభిమానులు విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు జపిస్తే తనకు ఇబ్బందేమీ లేదని లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హఖ్ అంటున్నాడు. నిజానికి అతడి లేదా ఇతరుల పేర్లు వినిపిస్తే బాగా ఆడాలన్న తపన పెరుగుతుందని చెప్పాడు. తన జట్టు గెలుపు కోసం మరింత కష్టపడాలన్న ప్రేరణ కలుగుతుందని వెల్లడించాడు. ఎలిమినేటర్లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో అఫ్గాన్ క్రికెటర్ల జోరు పెరుగుతోంది. ఒకప్పుడు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్లు డామినేట్ చేసేవారు. ఇప్పుడు నవీన్ ఉల్ హఖ్ వంటి పేసర్ జత చేరాడు. అంచనాల మేరకు రాణించి అదరగొట్టాడు. 8 మ్యాచుల్లో 7.82 ఎకానమీ, 19.89 సగటుతో 11 వికెట్లు తీశాడు. ఎలిమినేటర్లో ముంబయిపై 38 పరుగులిచ్చి 4 వికెట్ల ఘనత అందుకున్నాడు.
'ముంబయి ఇండియన్స్ మేం ఛేదించగలిగే టార్గెట్‌నే నిర్దేశించింది. వికెట్ కూడా బాగుంది. మధ్యలో ఒత్తిడిని అధిగమించలేక వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయాం. మ్యాచులో అదే టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజాయతీగా చెప్పాలంటే నా ప్రదర్శన బాగుంది. అయితే జట్టుకు మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. వ్యక్తిగత ప్రదర్శనలతో ప్రయోజనం ఉండదు. ట్రోఫీ గెలవడమే కదా అసలైన లక్ష్యం. ఐపీఎల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. మళ్లీ ఘనంగా పునరాగమనం చేస్తాను' అని నవీన్ ఉల్ హఖ్ అన్నాడు.
యశ్ ఠాకూర్, మొహిసిన్ ఖాన్ వంటి కుర్ర పేసర్లు ఎక్కువ పేస్ ఆఫర్ చేస్తుంటే నవీన్ మాత్రం తక్కువ వేగంతో బంతులు విసిరి వికెట్లు పడగొట్టాడు. 'బౌలింగ్ చేసే ముందు కండీషన్స్‌ను అర్థం చేసుకోవాలి. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. అయితే ఒకే ఓవర్లో 3, 4 స్లోవర్ బంతులు వేసేలా లేదు. అప్పుడప్పుడు స్లో బంతులతో సర్‌ప్రైజ్ చేస్తే ఫలితం వస్తుంది. టీ20 చాలా ఫాస్ట్ ఫార్మాట్. పరిస్థితులను వేగంగా అర్థం చేసుకోవాలి. ఒక అడుగు ముందే ఉండాలి' అని నవీన చెప్పాడు.
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో నవీన్ గొడవపడ్డాడు. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. దాంతో విరాట్ అభిమానులు అతడిని టార్గెట్ చేశారు. ఎక్కడికి వెళ్లినా కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించగా.. 'నేను వాటిని ఎంజాయ్ చేస్తాను. అభిమానులు అతడి (విరాట్) పేరు లేదా ఇతరుల పేరు జపించడాన్ని ఇష్టపడతాను. ఇది నా జట్టు కోసం మరింత ఫ్యాషన్‌తో ఆడేలా చేస్తుంది. బయట జరిగే దాన్ని పట్టించుకోను. నా ప్రాసెస్‌పై దృష్టి సారిస్తాను. బయటవాళ్లు అనేవి నాపై ప్రభావం చూపించవు. అలాంటివి మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మరింత మెరుగ్గా ఆడాలి. ఎందుకంటే అన్ని రోజులు మనవి కావు. ఒక్కోసారి విఫలం అవుతాం. మరోసారి స్పెషల్‌గా నిలుస్తాం. అప్పుడు అభిమానులు నా పేరును తలుచుకుంటారు. ఆటలో ఇవన్నీ భాగమే' అని ఈ అఫ్గాన్ పేసర్ అన్నాడు.
ఏడాది కాలంగా వన్డే క్రికెట్‌కు తాను దూరంగా ఉన్నానని నవీన్ చెప్పాడు. తన దేహం సౌకర్యంగా ఉంటే, పూర్తి ఫిట్‌నెస్ ఉందనిపిస్తే వన్డే ప్రపంచకప్ ఆడతానని పేర్కొన్నాడు. అఫ్గాన్ జట్టులో చేరి తిరిగి భారత్‌కు వస్తానని వెల్లడించాడు.