IPL 2022 TV Ratings: జనాలు ఐపీఎల్ చూస్తలేరా ఏందీ? 33% పడిపోయిన టీవీ రేటింగ్స్!
IPL మీడియా హక్కుల వేలానికి ముందు రేటింగులు పడిపోవడం బీసీసీఐ (BCCI), ఐపీఎల్ (IPL) పాలక మండలికి ఆందోళనగా మారింది. గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ (IPL 2022) తొలివారం రేటింగు 33 శాతం పతనమైంది.
IPL 2022 TV Ratings Opening Week ratings fall by 33 Percent: ఐపీఎల్ 15 సీజన్లో మ్యాచులు రసవత్తరంగా సాగుతోంటే టీవీ రేటింగులు మాత్రం పడిపోతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల వేలానికి ముందు రేటింగులు పడిపోవడం బీసీసీఐ (BCCI), ఐపీఎల్ (IPL) పాలక మండలికి ఆందోళనగా మారింది. గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ (IPL 2022) తొలివారం రేటింగు 33 శాతం పతనమైంది. మీడియా హక్కులపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని బోర్డు బాధపడుతోంది.
సాధారణంగా ఐపీఎల్ తొలి వారం టీవీ రేటింగులు విపరీతంగా ఉంటాయి. కానీ లీగ్ చరిత్రలో తొలిసారి తొలివారం రేటింగు పడిపోవడం గమనార్హం. ఈ సీజన్లో తొలి ఎనిమిది మ్యాచులకు 2.52 టీవీఆర్ స్కోరు లభించింది. 2021 సీజన్‌లోని 3.73 టీవీఆర్‌తో పోలిస్తే ఇది 33 శాతం తక్కువ. ఇక 2020 సీజన్ రేటింగ్ చూసుకుంటే 3.85గా ఉండటం గమనార్హం.
రేటింగే (IPL tv ratings) కాకుండా రీచ్ (IPL reach) కూడా పడిపోయినట్టు కనిపిస్తోంది. ఈసారి తొలివారం ఓవరాల్ రీచ్ 229.06 మిలియన్లుగా ఉంది. గతేడాది ఓపెనింగ్ రీచ్ 267.7 మిలియన్లతో పోలిస్తే 14 శాతం పతనమైంది. సాధారణంగా ఐపీఎల్ ఆరంభం కాగానే స్టార్‌స్పోర్ట్స్ హిందీ ఛానెల్ బార్క్ రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈసారి మాత్రం మూడో స్థానంలోనే ఉండిపోయింది.
వచ్చే ఐదేళ్లకు ఐపీఎల్‌ను ప్రసారం చేసేందుకు బీసీసీఐ (bcci) బిడ్డింగ్‌కు ఆహ్వానిస్తోంది. మీడియా హక్కులను విక్రయించడం ద్వారా బీసీసీఐకి దాదాపుగా రూ.50,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. బిడ్డింగ్ వేయాలంటే ముందుకు ఆయా సంస్థలు రూ.25 లక్షలు పెట్టి ముందుగా ఐటీటీ పత్రాలు కొనుగోలు చేయాలి. ఐపీఎల్‌లో జట్లు, మ్యాచులు పెరగడంతో ఈ సారి ఎక్కువ మంది పోటీపడతారని అంచనా.
ఈ ఏడాదితో స్టార్ హక్కులు ముగిసిపోతాయి. దాంతో 2023 -27 సైకిల్‌కు బీసీసీఐ బిడ్డింగ్స్ ఆహ్వానించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, టీవీ 18 వయాకామ్, అమెజాన్, జీ, సోనీ హక్కుల పత్రాలను కొనుగోలు చేశాయని తెలిసింది. ఈ ఐదుగురు చాలా సీరియస్‌గా హక్కుల కోసం ట్రై చేస్తున్నాయి. వీరికి పోటీగా ఫేస్‌బుక్ (Face book), ఆపిల్, నెట్‌ఫ్లిక్స్ వస్తున్నాయని తెలుస్తోంది. వచ్చే వారం వీరు ఐటీటీ పత్రాలు కొనుగోలు చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐటీటీ పత్రాలు కొనుగోలు చేసేందుకు మే 10 చివరి తేదీ. జూ 12న ఈ-వేలం ఉంటుందని తెలుస్తోంది.
చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అన్ని విభాగాలకు కలిపి కాంపోజిట్ బిడ్డింగ్ వేసింది. అయితే ఈ సారి బీసీసీఐ కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్ సబ్‌కాంటినెట్ డిజిటల్ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్ నాన్ ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్, 4 ప్లేఆఫ్ మ్యాచులు, 13 ఈవినింగ్ డబుల్ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఆవల ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.