PBKS vs CSK, Match Highlights: రాయుడు పోరాడినా - పంజాబ్ చేతిలో చెన్నై ఓటమి - ప్లేఆఫ్స్ కష్టమే!
IPL 2022, PBKS vs CSK: ఐపీఎల్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్‌లో చెన్నైకి మరో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున శిఖర్ ధావన్ (88: 59 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బ్యాటర్లలో రాయుడు (78: 39 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.
అదరగొట్టిన శిఖర్...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ నిదానంగా ప్రారంభం అయింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (18: 21 బంతుల్లో, రెండు ఫోర్లు) పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నాడు. మొదటి వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం మహీష్ ధీక్షణ బౌలింగ్‌లో మయాంక్ అవుటవడంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.
ఈ వికెట్‌తో కష్టాలు పంజాబ్‌కి కాదు కానీ... చెన్నైకి మొదలయ్యాయి. శిఖర్ ధావన్, భనుక రాజపక్స (42: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో చెన్నైపై ఏ జట్టయినా నమోదు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. చివరి ఓవర్లలో స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి రాజపక్స అవుటయ్యాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన లియాం లివింగ్ స్టోన్ (19: 7 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో ధావన్ సిక్సర్, బెయిర్‌స్టో బౌండరీ సాధించడంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రేవో రెండు వికెట్లు తీయగా... మహీష్ ధీక్షణకు ఒక వికెట్ దక్కింది.
రాయుడు మినహా...
అనంతరం చెన్నై బ్యాటర్లలో అంబటి రాయుడు మినహా ఎవరూ రాణించలేదు. రాబిన్ ఊతప్ప (1: 7 బంతుల్లో), మిషెల్ శాంట్నర్ (9: 15 బంతుల్లో, ఒక ఫోర్), శివం దూబే (8: 7 బంతుల్లో, ఒక ఫోర్) ముగ్గురూ విఫలం కావడంతో చెన్నై 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ (30: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు) నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిన పడేశారు.
అయితే రుతురాజ్, రాయుడు కీలక దశలో అవుట్ అయ్యారు. కెప్టెన్ జడేజా (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు. ధోని (12: 8 బంతుల్లో, ఒక ఫోర్లు, ఒక సిక్సర్) కూడా విఫలం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబడ, రిషి ధావన్ రెండేసి వికెట్లు తీయగా... సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లకు చెరో వికెట్ దక్కింది.